గత నాలుగు రోజుల నుంచి కాపుల రిజర్వేషన్ పై స్పష్టత కావాలని కాపులకు రిజర్వేషన్ కల్పించాలని ముద్రగడ పద్మనాభం తన స్వగృహంలోనే ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. అయితే దీనికి కాపుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయనకు మద్దతుగా రాజకీయ నాయకులు కూడా ముందుకు వస్తున్నారు. మాజీ మంత్రి చిరంజీవి, దాసరినారయణరావు ముద్రగడకు మద్దతు పలికారు. మరోవైపు వైసీపీ నాయకులు అంబటి ముద్రగడకు మద్దతుగా నిలిచారు. నేడు కాపుల డిమాండ్లను పరిష్కరించాలని డిమాండు చేస్తూ దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభంతో టీడీపీ నేతలు నేడు చర్చించనున్నారు. మంత్రి అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావ్‌లు ముద్రగడతో చర్చల్లో పాల్గొంటారు.

ముఖ్య అనుసంధాన కర్తలుగా..తోట త్రిమూర్తులు, బొడ్డు భాస్కరరామారావు వ్యవహరించనున్నారు.ముద్రగడను దీక్ష విరమించాలని నేతలు కోరనున్నారు.కమిషన్‌ కాల పరిమితి ఇంకా ఏడు నెలలు మాత్రమే ఉండడంతో కుదించడం కష్టమని ప్రభుత్వం చెపుతుంది. మరోవైపు ముద్రగడకు మద్దతు దాసరి నారాయణ రావు తెలిపిన విషయం తెలిసిందే. అయితే  రాజమండ్రిలో దర్శకరత్న దాసరి నారాయణ రావు పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కిర్లంపూడిలో ఆమరణ దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభాన్ని కలిసేందుకు రాజమండ్రి చేరుకున్న దాసరి ఓ హోటల్లో బస చేశారు.

హోటల్ చుట్టూ పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. కిర్లంపూడికి దాసరి చేరుకుంటే కొంత ఉద్రిక్తత తలెత్తవచ్చని పోలీసులు భావిస్తుండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. దాసరి హోటల్ బయటకు వస్తే అదుపులోకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ముద్రగడను నిరాహార దీక్ష విరమింప చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సమయంలో ఇలాంటి సెలబ్రెటీలు రావడం వల్ల వ్యవహారం మళ్లీ మొదటికే వస్తుందని భావిస్తున్నారు.

కిర్లంపూడికి వెళ్లే మార్గంలో తమను అడ్డుకోవద్దని దాసరి తదితరులు ఇప్పటికే ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో దాసరిని అరెస్ట్ చేయాలని గానీ, కిర్లంపూడికి వెళ్లనివ్వాలని గానీ పోలీసు వర్గాలకు ఎటువంటి స్పష్టమైన ఆదేశాలూ లేకపోవడంతో వారు అయోమయంలో ఉన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: