గ్రేట‌ర్ ఎన్నిక‌లు ముగిశాయి. అంతేకాదు ఏ పార్టీతో పొత్తు అవ‌స‌రం లేకుండానే గులాబీ పార్టీ సింగిల్ లీడింగ్ పార్టీ గా గెలుపును కైవ‌సం చేసుకుంది. ఇక ఇప్పుడు మేయ‌ర్, డిప్యూటీ మేయ‌ర్ ఎన్నిక‌ల ప్ర‌క్రియ పూర్తి చేసుకుని త్వ‌ర‌లో మున్సిపల్ పాలక వర్గం కొలువు తీర‌నుంది. అయితే ఇప్పుడు గులాబీ పార్టీ మ‌జ్లిస్ తో దోస్తానా చేయ‌నుందా, లేదా..? అన్న‌ది తేలాల్సి ఉంది. కానీ గులాబీ బాస్ మ‌జ్లిస్ తో ఎందుకు గొడ‌వ అనుకుని మిత్ర ప‌క్షంగా కొన‌సాగునుందా అన్న‌ది గులాబీ బాస్ చేతులో ఉంది. అయితే మ‌జ్లిస్ దోస్తానా అంటే విష‌యం కాదు.  ఆ పార్టీ స్నేహంగా ఉంటూనే షాక్ లిచ్చే సత్తా కేవ‌లం మ‌జ్లిస్ పార్టీకే  ఉంది. ఆ పార్టీ ఎవ‌రితో స్నేహహ‌స్తం చాచినా అలాంటి వారందరికి  షాకుల మీద షాకులు త‌గిలిన విష‌యం మీద సందేహాలు అక్క‌ర్లేదు. చరిత్రను చూస్తే చాలు.. అదెంత నిజ‌మన్న విష‌యం ఇట్టే తెలుస్తోంది.  అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఏ పార్టీయైనా గ్రేట‌ర్ విష‌యంలో మ‌జ్లిస్ పార్టీతో పొత్తు పెటుకోక త‌ప్పలేదు. 


అయితే మ‌జ్లిస్ పార్టీకి మాత్రం ఖ‌చ్చితంగా ఎదో కీల‌క ప‌ద‌వి ఇవ్వాల్సిందే. గ‌త కాంగ్రెస్ హ‌యాంలో 5 ఏళ్ల కాలం స‌గ కాలం మేయ‌ర్, డిప్యూటీ మేయ‌ర్ ప‌ద‌విని మ‌జ్లిస్ పార్టీ కి ద‌క్కించుకుంది. కానీ ఇప్పుడు గులాబీ పార్టీ గ‌ట్టి బ‌లంతో గ్రేట‌ర్ సీట్లు కైవ‌సం చేసుకుంది. ఒక ర‌కంగా చూస్తే గులాబీ పార్టీకి మ‌జ్లిస్ పార్టీ అవ‌సరం కూడాలేదు. అలాగ‌ని ఇప్ప‌టికిప్పుడే మ‌జ్లిస్ కు గుడ్ బై చెప్పేస్తే బాగుండ‌ద‌ని భావిస్తున్న గులాబీ బాస్ వారితో కొంచె స్నేహ పూర్వ‌కంగా ఉంటూనే గ్రేట‌ర్ లో ముందుకు వెళ్తుంద‌న్నవార్త‌లు గుప్పుమంటున్నాయి. ఇదీ ఇలా ఉంటే మ‌జ్లిస్ పార్టీ అలోచ‌న విధానం వేరేలా ఉన్న‌ట్లు తెలుస్తోంది. గ్రేట‌ర్ ఎన్నిక‌ల ప్రచారంలో భాగంగా జ‌న‌వ‌రి 31 న పాత బస్తీలో నిర్వ‌హించిన ఒక స‌భ‌ను ఉద్దేశించి ప్ర‌సంగించిన మ‌జ్లిస్ నేత అక్బ‌రుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. ఇందిరా గాంధీనే దారుస్స‌లాం వ‌చ్చారు కానీ...తామెప్పుడూ గాంధీ భ‌వ‌న్ లో అడుగు  పెట్ట‌లేదంటూ.. ద‌శాబ్దాల త‌ర‌బ‌డి దోస్తానా న‌డిచిన కాంగ్రెస్ గురించి వ్యాఖ్య‌లు చేశారు.


అంతేకాదు అవ‌స‌మైతే మోడీతో క‌లిసి కాంగ్రెస్ పాడె క‌డ‌తామ‌ని మండిప‌డ్డారు. కాంగ్రెస్ తో మ‌జ్లిస్ కు ఉన్న అనుబంధం ఎంతో అంద‌రికి తెలిసిందే. రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు.. శాశ్వ‌త మిత్రులు ఉండ‌రు. అదే స‌మ‌యంలో ఈ స్థాయి మాట‌లు రాజ‌కీయ పార్టీల నోటి నుంచి రావు కానీ మ‌జ్లిస్ నేతల నోటి నుంచి ఇలాంటి వ్యాఖ్య‌లు చాలా మామూలుగానే వ‌చ్చేస్తుంటాయి. మ‌జ్లిస్ తో తాజాగా దోస్తీ చేయాల‌ని భావిస్తున్న గులాబీ  బాస్ కేసీఆర్ మ‌రోసారి ఆలోచించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌జ్లిస్ తో దోస్తానా మ‌జ్లిస్ కే లాభం త‌ప్పించి... టీఆర్ఎస్ కు  ఏ మాత్రం లాభించ‌ద‌న్న‌ది నిజం. ఇక గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఫలితాలు చూస్తే...గ్రేట‌ర్ మొత్తం చుట్టేసిన కారు.. పాత బ‌స్తీలోకి మాత్రం ఎంట‌ర్ కాలేక‌పోయిన విష‌యం మ‌ర్చిపోకూడ‌దు. స్నేహ పూర్వ‌క పోటీ అని చెప్పిన‌ప్ప‌టికీ.. మ‌జ్లిస్ నేత‌లు ఎంత సీరియ‌స్ గా వ్య‌వ‌హ‌రించారో పొలింగ్ రోజున తెలంగాణ ముఖ్య‌మంత్రి మ‌హ‌మూద్ అలీ ఇంటిపై దాడితోనే వారి వ్యవ‌హారం అర్థం కాక మాన‌దు. 


తామేం చేసినా న‌డిచిపోవాల‌ని ఓల్డ్ సిటీ వైపు క‌న్నెత్తి చూడ‌కూడ‌ద‌న్న ష‌రత్తు పెట్టే మ‌జ్లిస్ నేత‌లు మాట‌లు విని ఏమ‌వుతుంద‌న్న భ‌రోసా తో వ్యవ‌హరించిన దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి లాంటి  వారు ఈ రోజు ఓవైసీ  బ్ర‌ద‌ర్స్ చెబుతున్న మాట‌లు వింటే.. తామెంత పెద్ద త‌ప్పు చేశామ‌న్న బాధ‌కు త‌ప్ప‌నిస‌రిగా గురి అవుతారు. మ‌జ్లిస్ తో ఫ్రెండ్ షిప్ అన్న‌ది అవ‌సరం కోసం చేస్తున్నార‌న్న భావ‌న‌లో ఓవైసీ సోదరులు ఉంటారు. ఎంత‌టి వారైనా త‌మ వ‌ద్ద‌కే రావాలే కానీ...తాము ఎవ‌రి వ‌ద్ద‌కు వెళ్లాల్సిన అవ‌స‌రంలేద‌న్న భావ‌న వారి మాట‌ల్లో స్ప‌ష్టం గా క‌నిపిస్తోంది. అందుకు నిద‌ర్శ‌న‌మే.. ఇందిరా గాంధీ ప్ర‌స్తావ‌న‌. ఇందిర లాంటి నేత‌నే పూచిక‌పుల్ల తో స‌మానంగా తీసేసి ఓవైసీ బ్ర‌ద‌ర్స్...కేసీఆర్ లాంటి వారు పెద్ద విష‌య‌మేమీ కాద‌న్న‌ది మారిచిపోకూడ‌దు. వాస్త‌వానికి ఓవైసీ బ్ర‌ద‌ర్స్ చెప్పే  మాట‌ల‌కు త‌గ్గ‌ట్టే వారి చేత‌లు ఉండి.. పాతమబ‌స్తీ కానీ అభివృద్ధి చెంది.. అక్క‌డి ప్ర‌జ‌లు కానీ ఆలోచించే ప‌రిస్థితే వ‌స్తే.. తాజాగా గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఇలా ఉండేవి కాదు.


ద‌శాబ్దాలుగా తామే ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పాత‌బస్తీ లో ఇప్ప‌టికి అభివృద్ధి ఎందుకు లేదు? పాత‌బ‌స్తీ వాసుల బ‌తుకుల్లో మార్పు ఎందుకు రావడం లేద‌న్న‌ది చూస్తే... ఓవైసీ బ్ర‌ద‌ర్స్ ఎలాంటి వారో ఇట్టే అర్థ‌మ‌వుతుంది. తిరుగులేని అధిక్య‌త‌తో దూసుకెళుతున్న కేసీఆర్ కు.. మజ్లిస్ బ‌లంగా అనిపించ‌క‌పోవ‌చ్చు. దోస్తానా ముసుగులో కేసీఆర్ కానీ వాస్త‌వాన్ని వ‌దిలేస్తే.. భ‌విష్య‌త్తులో దెబ్బేయ‌క మాన‌దు. ఇక‌పోతే కేసీఆర్ గ్రేట‌ర్ ఎన్నికల సంద‌ర్భంగా మ‌జ్లిస్ త‌మ మిత్ర ప‌క్ష‌మ‌ని తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ రెండు సార్లు ప్ర‌స్తావించారే కానీ... ఓవైసీ బ్ర‌ద‌ర్స్ ఇద్ద‌రిలో ఏ ఒక్క‌రూ గ్రేట‌ర్ ప్ర‌చారంలో ప్ర‌స్తావించ‌లేద‌న్న విష‌యాన్ని గుర్తుంచుకోవాల్సిందే. ఇదే విష‌యాన్ని రానున్న రోజుల్లో ఏదో ఒక‌రోజు ఓవైసీ బ్ర‌ద‌ర్స్ ప్ర‌స్తావించి.. కేసీఆర్ కావాల‌నే దోస్తానా గురించి ప్రస్తావించారే త‌ప్ప‌.. తామెప్పుడూ మాట్లాడిన ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌సరంలేదు.


ఏదీఏమైనా ఈ సారి మాత్రం గ్రేట‌ర్ ఎన్నిక‌ల  ఏక‌పక్షంగా జరిగాయ‌న్న‌ది ప్ర‌త్యేకంగా చెప్పాల్సి ప‌నిలేదు కానీ.. ఈ ఎన్నిక‌ల్లో అన్ని పార్టీలు బిచానా ఎత్తేసినా.. ఎంఐఎం మాత్రం మ‌రింత పెంచుకుందే త‌ప్ప ఏ మాత్రం త‌గ్గ‌లేదు. ఎప్ప‌టికీ అధికార ప‌క్షానికి మిత్రం ప‌క్షంగా ఉంటే ఎంఐఎం ఈ సారి మాత్రం టీఆర్ఎస్ తో ఎలా ఉండ‌బోతుందో నన్న ఆశ‌క్తి మాత్రం ఉంది. దీనికి గులాబీ బాస్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి మ‌రి.


మరింత సమాచారం తెలుసుకోండి: