ఏదైనా ఉద్య‌మం ప్రారంభించేట‌ప్పుడు పాల‌కుల నుంచి తాను అనుకున్న‌ది సాధించే వ‌ర‌కు పోరాటాలు సాగుతూ ఉంటాయి. కాక‌పోతే ఆయా సందర్భంలో ఉద్య‌మం మ‌రోరూపాంత‌రం చెందుతూ ఉంటుంది. ఏ ప్రాంతంలో ఉద్య‌మాలు చేసినా ఇదే సిద్దాంతం అవ‌లంభిస్తూ ఉంటారు. తెలంగాణ రాష్ట్ర సాధ‌న ఉద్య‌మం కేంద్రం నుంచి ప్ర‌క‌ట‌న వ‌చ్చేవ‌ర‌కు ఉద్య‌మం ఆగ‌లేదు. 12 ఏళ్లు ఉద్య‌మించి చివ‌రకు రాష్ట్రాన్ని సాధించారు. కానీ ఏపీలో జ‌రుగుతున్న కాపు ఉద్య‌మం మాత్రం ఇందుకు భిన్నంగా  జ‌రిగింద‌నే చెప్పాలి. ఏపీ లో ఉన్న కాపులను బీసీల్లో చేర్చాల‌ని డిమాండ్ చేస్తూ.. 20 ఏళ్లుగా ఉద్య‌మం కొన‌సాగుతూనే ఉంది. అయితే తాజాగా మ‌రోసారి మాజీ మంత్రి ముద్ర‌గడ ప‌ద్మ‌నాభం ఉద్య‌మ జెండా ను ఊపారు. మ‌హ‌స‌భగా ఏర్పాటు చేసిన కాపు గ‌ర్జ‌న ఒక్క‌సారిగా ఉద్య‌మ రూపం దాల్చి.. రైలు, పోలీస్ స్టేషన్ల పై ఉద్య‌మ కారులు చేసిన బీభ‌త్సం ఇంతా అంతా కాదు.  కాపు ఉద్య‌మాన్ని కొన‌సాగింపు గా ముద్ర‌గ‌డ ఆమ‌ర‌ణ నిర‌హ‌ర దీక్ష‌కు దిగారు. నాలుగు రోజులుగా చేసిన దీక్ష‌కు చివ‌ర‌కు  శుభం కార్డు ప‌డింది.


కానీ ఇక్క‌డ ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యం పైనే ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. మంత్రి అచ్చెయ‌న్నాయుడు ముద్రగ‌డ ప‌ద్మ‌నాభం ను క‌లిసిన బృందంలో ఉన్న‌ప్ప‌టికీ... ప్రభుత్వ ప్ర‌తిపాద‌న‌ల్ని ఏపీ టీడీపీ అధ్య‌క్షుడు క‌ళా వెంకట్రావ్.. మీడియా కి వివ‌రించ‌డం.. మంత్రి హోదాలో అచ్చెయ‌న్నాయుడు, ముద్ర‌గ‌డ డిమాండ్ల‌కు త‌లొగ్గామ‌ని చెప్పాల్సింది పోయి.. కళా వెంక‌ట్రావ్ చెప్ప‌డ‌మేంటో ఎవ‌రికి అర్ధం కాలేదు. ఇక్క‌డ క‌ళా వెంకట్రావ్ చెబితే అది పార్టీ నిర్ణ‌యం అవుతుంది. మంత్రి అచ్చెయ‌న్నాయుడు చెబితే అది ప్రభుత్వం త‌రపున ప్ర‌క‌ట‌న అవుతుంది. ఈ లాజిక్ ముద్ర‌గ‌డ ఎలా మిస్స‌యారో ఆయ‌న‌కే తెలియాలి. కాపుల‌ను బీసీల్లో చేర్చాల‌న్న ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం డిమాండ్ పై ప్ర‌భుత్వం స్ప‌ష్ట‌త నివ్వ‌లేదు. ఆ స్ప‌ష్ట‌త కోస‌మే క‌మిష‌న్ ఏర్పాటు చేశామ‌ని మాత్రం ముద్ర‌గ‌డ కు టీడీపీ నేత‌లు వివ‌రించారు. క‌మిటీ వేసిన విష‌యం తెలిసే క‌దా.. ముద్రగ‌డ ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌కు సిద్ద‌మయ్యింది. మ‌రి.. ఆయనెందుకు ప్ర‌భుత్వ ప్ర‌తిపాద‌న‌కు ఓకే చెప్పిన‌ట్లు?  కాపు కార్పొరేష‌న్ కి వెయ్యి కోట్లు కేటాయించాల‌ని ముద్ర‌గడ డిమాండ్ చేశారు.


గ‌త ఏడాదికి సంబంధించి మ‌రో వెయ్యి కోట్లు.. మొత్తం రెండు వేల కోట్లు కేటాయించాల‌న్న‌ది  ఆయ‌న డిమాండ్. ప్ర‌భుత్వం  మాత్రం 500  కోట్లు  కేటాయిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. అయినా ముద్ర‌గ‌డ స‌రే అన్నారు. కాపు ఉద్య‌మానికి వ్య‌తిరేకంగా బీసీ సంఘాల్ని చంద్ర‌బాబు రంగంలోకి దించారు!. ఈ వ్య‌వ‌హారం పై టీడీపీ, ముద్ర‌గ‌డ కు ఏం వివ‌ర‌ణ ఇచ్చార‌న్న‌ది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్నే. ఎలాగైతేనేం.. టీడీపీ నేత‌లు మాత్రం ముద్ర‌గ‌డ‌కు నిమ్మ‌ర‌సం ఇచ్చారు. ముద్ర‌గ‌డ కూడా దాన్ని సేవించారు. అదీ త‌ను తెర‌పైకి తెచ్చిన   ఏ ఒక్క డిమాండ్ కీ ప్రభుత్వం త‌లొగ్గ‌కుండానే. ఈ మాత్రం దానికి ఓ రైలు ద‌హ‌నం, పోలీస్ స్టేష‌న్ కి నిప్పులు .. ప‌లు వాహ‌నాలు త‌గ‌ల‌బ‌డ‌టం.. ఇంత విధ్వంసం ఎందుకు చేసిన‌ట్టు? ఉద్య‌మాలు చేయ‌డంలో ఈలాంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకోవ‌డం ష‌రామాములే అయినా.. ఉద్య‌మ డిమాండ్ నెర‌వేర‌క ముందే దీక్ష విర‌మించ‌డం ఏంట‌న్న‌దీ ప్ర‌శ్న‌. ఇక‌పోతే విధ్వంసం కేసుల్లో అరెస్టుల‌కు సంబంధించిన లోతైన విచార‌ణ త‌రువాతే ఎలాంటి చ‌ర్య‌లైనా తీసుకుంటార‌ని ప్ర‌క‌టించారు. అది కూడా క‌ళా వెంక‌ట్రావ్ గారే ప్ర‌క‌టించారు.


అంటే.. విచార‌ణ జ‌ర‌ప‌కుండానే ఇలాంటి కేసుల్లో అరెస్టులు జ‌రుగుతాయా..? తుని ఘ‌ట‌న లో టీడీపీ స‌ర్కార్ అలాంటి అర్ధం ప‌ర్థం లేని అరెస్టులు చేసింద‌ని క‌ళా వెంక‌ట్రావ్ చెబుతున్నారా..? అన్న ప్ర‌శ్న కు స‌మాధానం అయ‌నే క్లారిటీ ఇవ్వాలి. ఏదీ ఏమైనా ఇక్క‌డ డిమాండ్లు నెర‌వేర‌క ముందే ముద్ర‌గ‌డ మాత్రం దీక్ష విరమించార‌న్న‌ది న‌మ్మాల్సిన నిజం. ఒక్క‌సారి దీక్ష విర‌మ‌ణకు క‌ళా వెంకట్రావ్ క‌ర‌ణాలు గ‌మ‌నిస్తే.. కాపుల‌కు ప్ర‌త్యేక క‌మిష‌న్ ఏర్పాటు నిర్ణయం నుంచి 9 నెల‌లు కాల‌ప‌రిమితి ఉండాలి. కాపుల క‌మిష‌న్ కు ద‌ర‌ఖాస్తు చేసిన వారంద‌రికి స‌హాయం అంద‌జేత‌. తుని సంఘ‌ట‌న‌లో లోతుగా ప‌రిశీల‌న త‌రువాతే కేసులు..  ఇప్పుడు పెట్టిన కేసుల ఎత్తివేత‌, ప్ర‌తి బ‌డ్జెట్  లో వెయ్యి కోట్లు.. ఈ నాలుగు కార‌ణాల్లో కేసుల సంగ‌తి ప‌క్క‌న పెడితే మ‌రేవీ ముద్ర‌గ‌డ సాధించిన‌వి కాదు. అవి అన్నీ గ‌డచిన నాలుగు రోజులుగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చెబుతున్న‌వే. అసలు ముద్ర‌గ‌డ ప్ర‌ధాన డిమాండ్ జీవో నెంబ‌ర్ 30 ని పున‌రుద్ద‌రించాల‌ని. అసలు అది సాధ్యం కాద‌నే చంద్ర‌బాబు
చెబుతూనే వ‌చ్చారు.


మ‌రి ముద్రగ‌డ ఏం సాధించారో అయ‌న‌కే తెలియాలి. కేసులు ఎత్తివేస్తామ‌ని అన‌డం లేదు. లోతుగా ప‌రిశోధ‌న చేసి కేసులు పెడ‌తాం అంటున్నారు. మ‌రి కొత్త‌గా ముద్ర‌గ‌డ ఏం సాధించిన‌ట్లు? మూడు నెల‌ల కాల‌ప‌రిమితి అన్న‌ది లేదు. ఉమ్మ‌డి రాష్ట్రంలో చంద్ర‌బాబు సీఎం గా  ఉన్న‌ప్పుడే కాపుల విష‌యంలో నిర్ణ‌యం స‌రిగ్గా తీసుకోలేద‌ని తెలిపిన ముద్ర‌గడ మ‌రోసారి చంద్ర‌బాబును ఏలా న‌మ్ముతున్నారో ఆయ‌న‌కే తెలియాలి. తుని ప్ర‌సంగంలో ఆయ‌న కేవ‌లం చంద్ర‌బాబు నే టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు వ‌ర్షం కురిపించారు. చంద్ర‌బాబే కాపు రిజ‌ర్వేష‌న్ల‌కు అడ్డు ప‌డ్డార‌ని.. ఇక ఊరుకునే ప్ర‌సక్తే లేద‌ని రిజ‌ర్వేష‌న్లు ఇచ్చే వ‌ర‌కు ఎవ్వ‌రు ఇక్క‌డి నుంచి వెళ్లొద్ద‌ని తెలిపిన ముద్ర‌గ‌డ.. ఇప్పుడు ఎలాంటి వాగ్దానాల‌తో దీక్ష విరమించార‌న్న‌ది పెద్ద ప్రశ్నేగా మిగిలింది. కాపుల ఆక‌లి తీర్చేందుకే నేను ఉద్య‌మాన్ని చేప‌ట్టాన‌ని తెలిపిన ముద్ర‌గ‌డ మ‌రోసారి ఉద్య‌మానికి పుల్ స్టాప్ పెట్టిన‌ట్టేన‌న్న సందేహం క‌ల‌గ‌క త‌ప్ప‌దు.


వాస్తవాన్ని గ‌మ‌నిస్తే .. ముద్ర‌గ‌డ దీక్ష ఎందుకు ప్రారంభించారో.. ఎందుకు విర‌మించారో ఆయ‌నకే తెలియాలి. ఎందుకంటే మూడు రోజుల క్రితం పార్టీ నాయకులు వ‌చ్చి క‌లిసారు. డిమాండ్ లు సెట్ కాలేదు అన్నారు. నిన్న రాత్రి మ‌ళ్లీ క‌లిసారు. ఇప్పుడు ఓ మంత్రి ఇద్ద‌రు పార్టీ నేత‌లు క‌లిసారు. డిమాండ్లు మాత్రం  అలానే ఉన్నాయి. ఉద్య‌మాలు చేసేది డిమాండ్లు సాధించుకునేందుకే కానీ మ‌ళీద‌శ కాపు ఉద్య‌మం మాత్రం ముమ్మాటికి నిర్విర్య‌మైన‌ట్టేన‌న్న వాద‌న‌లు గ‌ట్టిగా వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం నిర్ణ‌యం ఎలా ఉండ‌బోతుందో.. దీనికి ముద్ర‌గ‌డ ఆండ్ కో ఎలా స్పందిస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: