ప్రపంచంలో ఉగ్రవాదం విషబీజాల్లా నాటుకు పోతుంది. అత్యంత కిరాతకంగా మనుషు ప్రాణాలు తీస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఏ మూల నుంచి ఎలా దాడులు చేస్తారో అని అగ్ర రాజ్యాలు సైతం తలలు పట్టుకుంటున్నాయి. మరోవైపు అమెరికా, రష్యా లాంటి అగ్ర రాజ్యాలు ఉగ్రవాదులపై దాడులు మొదలు పెట్టాయి. తాజాగా భారత్ లో 26/11 ముంబై దాడుల్లో కీలక పాత్రధారి డేవిడ్ హెడ్లీ నోరు విప్పాడు.  గత కొంత కాలంగా ఊరిస్తూ వస్తున్న హెడ్లీ ఎట్టకేలకు నోరు విప్పాడు. ఆ మారణహోమానికి సంబంధించి కీలకమైన వివరాలను న్యాయస్థానానికి వెల్లడించాడు.  ప్రస్తుతం అమెరికా జైలులో 35 సంవత్సరాల శిక్ష‌ను అనుభవిస్తున్నాడు హెడ్లీ. అతడిని వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ముంబై కోర్టు విచారించింది.

ఆ దాడి వెనుక లష్కరే పాత్ర ఉందని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు. వాస్తవానికి తాను   భారత్ రావడానికే అమెరికన్ జాతీయుడి పేరు పెట్టుకున్నానని, తన అసలు పేరు దావూద్ గిలానీ అని వివరించాడు. 2008, నవంబర్ 26 మారణ హోమం సృష్టించడానికి ముందు తాను ముంబైకి ఏడు సార్లు వెళ్లినట్టు, అనంతరం 2009లో ఒకసారి ఢిల్లీకి వెళ్లినట్టు చెప్పాడు.  ముంబై నగరంలో 166 మంది మరణానికి, 309 మంది క్షతగాత్రులవటానికి కారణమైన 2008 నవంబర్ 26 నాటి ఉగ్రదాడులకు ముందు జరిగిన పరిణామాలన్నిటి గురించీ ప్రత్యేక న్యాయమూర్తి జి.ఎ.సనాప్ ఎదుట వివరించాడు.

విదేశీ గడ్డ నుంచి భారతదేశంలోని కోర్టుకు వీడియో వాంగ్మూలం ఇవ్వటం ఇదే తొలిసారి. ఉదయం 7 గంటలకు మొదలైన వాంగ్మూలం ప్రక్రియ ఐదున్నర గంటల పాటు కొనసాగింది.గతేడాది డిసెంబర్ 10న హెడ్లీ అప్రూవర్ గా మారుతానని ముంబై కోర్టుకు తెలిపాడు. దానికి జడ్జి సనప్ ఒప్పుకున్నారు. దీనికి సంతోషించిన హెడ్లీ 'నేను నా నేరాలన్నీ ఒప్పుకుంటున్నాను. చాలా గిల్టీగా ఫీలవుతున్నాను. నాకు తెలిసిన విషయాలన్నీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను' అని వీడియో కాన్ఫరెన్స్ లో చెప్పాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: