ఇప్పుడు  అంద‌రి నోళ్ల‌లో దీనిపైనే చ‌ర్చ‌. గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్నిప‌ల్ కార్పొరేష‌న్ మేయ‌ర్ ఎవ‌రు అధిరోహించ‌బోతున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో చ‌రిత్ర లో ఎప్పుడూ లేనంత భారీ మెజారిటీ తో విజ‌యం సాధించిన టీఆర్ఎస్ మేయ‌ర్ అభ్య‌ర్థిని మాత్రం ఇంత‌వ‌రకు ప్ర‌క‌టించ‌లేదు. దీనిపై ఇప్ప‌టికే ర‌క‌రకాలుగా ఊహాగానాలు సాగుతున్నా... టీఆర్ఎస్ అధినేత, ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శేఖ‌ర్ రావు మ‌దిలో ఏ ముందో ఎవ‌రికీ అంతు బ‌ట్ట‌డం లేదు.  నగ‌ర ప్ర‌థ‌మ పౌరుడు ఎవ‌ర‌వుతార‌న్న విష‌యం స‌ర్వ‌త్రా ఉత్కంఠ  నెల‌కొంది.  ఇప్ప‌టికే కొంత మంది పేర్లు ముందు వ‌రుస‌లో ఉండ‌గా.. మ‌రి కొంత మంది కార్పోరేట‌ర్లు గ్రేట‌ర్ పీఠం కోసం ఫైర‌వీలు మొద‌లు పెట్టారు. రిజ‌ర్వేష‌న్ ప్ర‌కారం మేయ‌ర్ ప‌ద‌వి బీసీ జ‌న‌రల్ కావ‌డంతో బీసీ నాయ‌కులు అధిష్టానం తో బెర సారాలు చేసుకుంటున్నారు. ఇక‌పోతే  చ‌ర్ల‌పల్లి కార్పోరేట‌ర్, టీఆర్ఎస్ యువ‌జ‌నవిభాగం రాష్ట్ర అధ్య‌క్షుడు బొంతు రామ్మోహ‌న్ పేరు విన‌బడుతుండ‌గా.. మ‌రోవైపు ఆ పార్టీ నేత‌, కే కేశ‌వ‌రావు కూతురు బంజారాహిల్స్ కార్పోరేట‌ర్ గద్వాల్  విజ‌య‌ల‌క్ష్మీ పేరు కూడా విన‌బ‌డుతుంది.


రాజ‌కీయాల్లో అంతగా అనుభవం లేని విజ‌య‌ల‌క్ష్మి ని మేయ‌ర్ ప‌ద‌వి ఇస్తారా లేదా అన్నది అనుమాన‌మే. బొంతు రామ్మోహ‌న్ పార్టీ ఏర్పాటు నుంచి  ఉంటునే కీల‌క భూమిక పోషించారు. తెలంగాణ  ఉద్య‌మంలో సైతం టీఆర్ఎస్ యువ‌జ‌న విభాగాన్ని ఏర్పాటు చేసి పార్టీలో యువ‌కుల‌తో ముందుకుపోయారు. ఇదీలా ఉంటే... ఈ నెల 11 వ తేదీన అన‌గా రేపు మేయ‌ర్ ఎన్నిక నిర్వ‌హించ‌డానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎన్నిక‌ల ఫ‌లితాలు రావ‌డానికి ముందు నుంచే గ్రేట‌ర్ మేయ‌ర్ స్థానాన్ని కైవ‌సం చేసుకోవ‌డానికి టీఆర్ఎస్ ప్ర‌ణాళికా బ‌ద్దంగా, పక‌డ్బందీ వ్యూహంతో ప‌నిచేసింది. టీఆర్ఎస్ కు సంపూర్ణ మెజారిటీ రాని ప‌క్షంలో ఎంఐఎం మ‌ద్ద‌తుతో మేయ‌ర్ స్థానాన్ని కైవ‌సం చేసుకోవాల‌న్న ఆలోచన చేసిన‌ట్టు కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌తోనే స్ప‌ష్ట‌మైంది. అదీ సాధ్యం కాని ప‌రిస్థితి ఉంటే హైద‌రాబాద్ మున్సిప‌ల్ లో ఎక్స్ ఆఫిషియే స‌భ్యుల ద్వారా మేయ‌ర్ పీఠం ద‌క్కించుకోవాల‌ని భావించింది. అయిత అంద‌రి అంచనాల‌కు త‌ల‌కిందులు చేస్తూ టీఆర్ఎస్ కు భారీ మెజారిటీ ద‌క్క‌డంతో ఇప్పుడు ఆ పార్టీ ఎవ‌రి మ‌ద్ద‌తు లేకుండానే మేయ‌ర్ సీటును ద‌క్కించుకోనుంది.


ఎంఐఎం ను మిత్ర‌ప‌క్షం చేసుకుని  మేయ‌ర్ స్థానాన్ని గెలుచుకునే ప‌రిస్థితి తలెత్తి ఉంటే మేయ‌ర్ అభ్య‌ర్థి ఎంపిక విష‌యంలో ఒక ర‌క‌మైన వ్యూహం, ఎక్స్ ఆఫీషియో సభ్యుల మ‌ద్ద‌తు కూడా అవ‌స‌ర‌మైన ప‌రిస్థితి ఏర్ప‌డి ఉంటే మ‌రో ర‌క‌మైన వ్యూహంతో ముందుకెళ్లాల‌ని టీఆర్ఎస్ నాయ‌క‌త్వం ప్ర‌ణాళిక రచించింది. ఇప్పుడు ఇత‌రుల మ‌ద్ద‌తు అవ‌స‌రం లేకుండానే స్వ‌తంత్రంగా అభ్య‌ర్ధిని ఎంపిక చేసుకునే బ‌లం స‌మ‌కూర‌డంతో ఆ పార్టీ నాయ‌క‌త్వం ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు తెలుస్తోంది. మేయ‌ర్ అభ్య‌ర్ది ఎవ‌ర‌న్న విష‌యంలో ఆ ఎన్నిక రోజు వ‌ర‌కు స‌స్పెన్స్ కొన‌సాగే అవ‌కాశాలు క‌న‌బ‌డుతున్నాయి. మేయ‌ర్ అభ్య‌ర్థి ఎంపిక విష‌యంలో పూర్తిగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిర్ణ‌యిస్తార‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఎన్నిక‌ల‌కు వెళ్లే రోజున ఉన్న ప‌రిస్థితి ఇప్పుడు లేనందున మేయ‌ర్, డిప్యూటీ మేయ‌ర్ ల ఎంపిక పూర్తిగా కేసీఆర్ ఆలోచ‌న‌ను బట్టే ఉంటుంది. ఇక‌పోతే మేయ‌ర్ ప‌దవికి  చ‌ర్ల‌ప‌ల్లి డివిజ‌న్ నుంచి కార్పొరేట‌ర్ గా ఎన్నికైన బొంతు రామ్మోహ‌న్ పేరు బ‌లంగా వినిపిస్తోంది.


రామ్మోహ‌న్ కార్పొరేట‌ర్ గా పోటీ పెట్టిన సంద‌ర్భంగానే ఆయ‌న పేరు మేయ‌ర్ ప‌ద‌వి ఇస్తామ‌ని సూత్ర‌ప‌పాయంగా పార్టీ నాయ‌కత్వం తెలిపింద‌ని పార్టీ నేత‌లు చెబుతున్నారు. మేయ‌ర్  ప‌దవి ఎంపిక కోసం ఎంఐఎం మ‌ద్ద‌తు తీసుకోవ‌ల‌సిన అవ‌ర‌సం ఏర్ప‌టి ఉంటే డిప్యూటీ మేయ‌ర్ ప‌ద‌విని ఎంఐఎం కు ఇచ్చే ప‌రిస్థితి త‌లెత్తేది. ఇప్పుడా ప‌రిస్థితి లేనందున డిప్యూటీ మేయ‌ర్ ప‌ద‌వి కూడా టీఆర్ఎస్ అభ్య‌ర్థిని  ఎంపిక చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం ఎన్నికైన కార్పొరేట‌ర్ల లో ముస్లిం మైనారిటీకి చెందిన వ్య‌క్తికి డిప్యూటీ మేయ‌ర్ ప‌ద‌వి ఇస్తారని తెలుస్తోంది. మేయర్ పీఠం దక్కించు కోవడానికి గ్రేటర్ పరిధిలోని మొత్తం 150 డివిజన్లలో ఎక్స్ అఫీషియో సభ్యులను పరిగణలోకి తీసుకోకుంటే... 76 డివిజన్లు ఉంటే సరిపోతుంది. అయితే టీఆర్ఎస్ అనూహ్యంగా 99 డివిజన్లతో తిరుగులేని మెజారిటీ సాధించిన విషయం తెలిసిందే. 150 మంది డివిజన్ల కార్పొరేటర్లతో పాటు ఎక్స్అఫీషియో సభ్యులుగా మరో 67 మంది సభ్యులు ఓటు హక్కు కలిగి ఉన్నారు. వారికి పరిగణలోకి తీసుకున్న తర్వాత కూడా టీఆర్ఎస్ కు బంపర్ మెజారిటీ ఉంది.


లోక్ సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు మొత్తం కలిపి ప్రస్తుతం జీహెచ్ఎంసీలో 67 మంది ఎక్స్అఫీషియో సభ్యులు ఉండగా, వారిలో టీఆర్ఎస్ కు 35, ఎంఐఎంకు 10, టీడీపీకి 7, కాంగ్రెస్ కు 5 ఓట్లున్నాయి. ఇంతకాలం టీఆర్ఎస్ కు 34 మంది సభ్యులు మాత్రమే ఉన్నప్పటికీ తాజాగా మంగళవారం టీడీపీకి చెందిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ కూడా టీఆర్ఎస్ లో చేరడంతో ఆ పార్టీ బలం 35 కు పెరిగింది. మొత్తం 150 డివిజన్లతో పాటు 67 మంది ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి 217 మంది ఓటర్లలో  134 ఓట్లు టీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి. ఈ లెక్క తీసుకున్నా టీఆర్ఎస్ ఎవరి మద్దతు లేకుండా మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలను దక్కించుకోగలదు. గ్రేటర్ మేయర్ పదవి టీఆర్ఎస్ ను వరించడం ఖాయమైన నేపథ్యంలో ఆ ఎన్నికలో పాల్గొనాలా లేదా అన్న మీమాంసలో టీడీపీ నేతలున్నారు. 


ఈ విషయంలో బీజేపీ వాదన భిన్నంగా ఉన్నట్టు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు సైతం మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలో పాల్గొనాలా లేదా ఇంకా తేల్చుకోలేదని తెలిసింది. ఏదీ ఏమైనా టీఆర్ఎస్ పార్టీ బొంతు రామ్మోహ‌న్ పేరు ఎక్కువ‌గా వినిపిస్తున్న నేప‌థ్యంలో గులాబీ బాస్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకోనున్నారో, తెర‌పైకి మ‌రేవ‌రి పేరు రానుందో ..?  లేక బొంతు రామ్మోహ‌న్ పేరు ఖ‌రారు కానుందా మ‌రో 24 గంట‌ల్లో తెలిపోనుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: