బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంస్కరణల్లో భాగంగా కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధుల్లో కోత విధించింది. ఇతర పథకాలకు తమ వాటాను గణనీయంగా తగ్గించింది. రాష్ర్టాల బడ్జెట్లలో కేంద్ర నిధులు కీలకం. కేంద్రం ఎంతమేర నిధులు ఇస్తుందనేదానిని బట్టి.. రాష్ట్ర సర్కారు మిగిలిన నిధులను కేటాయించాల్సి ఉంటుంది.  కేంద్ర బడ్జెట్ సమావేశాలు ఈనెల 23 నుంచి ప్రారంభమవనున్న నేపథ్యంలో రెండు, మూడు రోజులు అటూ ఇటూగా రాష్ట్ర బడ్జెట్ సమావేశాలుకూడా ప్రారంభమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి.  

కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 29న పార్లమెంటులో 2016-17 బడ్జెట్‌ను సమర్పించనుంది. ఇప్పటికే ఈ విషయాన్ని  ఆర్థికశాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా వెల్లడించారు.  రానున్న రెండు మూడేళ్లకూ మార్గనిర్దేశం చేసేలా ఈ బడ్జెట్ ఉంటుందని కూడా ఆయన వెల్లడించారు.  ఆర్థికశాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా, ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం, నీతీ ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియాలు ఆర్థికమంత్రి బడ్జెట్ టీమ్‌లో ఉన్నారు.

ఇక అధికారిక బృందానికి ఫైనాన్స్ సెక్రటరీ రతన్ వాటెల్, ఆర్థిక కార్యదర్శి శక్తికాంత్ దాస్, రెవెన్యూ కార్యదర్శి హాస్‌ముఖ్ ఆదియా, డిజిన్వెస్ట్‌మెంట్ సెక్రటరీ నీరజ్ గుప్తాలు నేతృత్వం వహిస్తున్నారు. బడ్జెట్ రూపకల్పనలో భాగంగా  ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ జనవరి 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకూ  వివిధ  పరిశ్రమ, వాణిజ్య సంఘాలు, ఆర్థికవేత్తలుసహా పలు వర్గాల నుంచి అభిప్రాయాలను తెలుసుకున్నారు.  ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీకి ఇది రెండవ పూర్తిస్థాయి బడ్జెట్ కాగా... మొదటి 2014 మధ్యంతర బడ్జెన్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటే మూడవది. 


మరింత సమాచారం తెలుసుకోండి: