కేంద్ర బడ్జెట్ ముగిసిన తర్వాత మార్చి 5న రాష్ట్ర బడ్జెట్, 8న వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టాలని ఏపీ  సర్కారు ఇప్పటికే నిర్ణయించింది.  గత ఏడాదిలాగే ఈ సారి కూడా వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. కాపు కార్పొరేషన్‌కు వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తామని సీఎం ప్రకటించిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా అధికారులు ప్రతిపాదనలు తయారుచేస్తున్నారు. గత వారం రోజుల క్రితం ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిన దరిమిళ వచ్చే బడ్జెట్ లో కాపు కార్పొరేషన్ కు వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తామని ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించారు.

ఇక వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేసే విధంగా గత ఏడాది  వ్యవసాయానికి 14వేల 184 కోట్ల రూపాయలతో ప్రత్యేక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సారి కూడా మార్చి 8వ తేదీన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యవసాయ బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టనున్నారు. మొత్తం మీద రాష్ట్ర బడ్జెట్ లక్షా 30వేల కోట్ల రూపాయలు దాటే అవకాశాలన్నాయి. ఇందులో ప్రణాళికేతర వ్యయం దాదాపు 90 వేల కోట్లు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

2015-16 ఆర్థిక సంవత్సరంలో ప్రణాళికేతర వ్యయం కింద 78,637 కోట్లు, ప్రణాళిక వ్యయం 34,412 కోట్లు కలిపి మొత్తం 1,13,049 కోట్లుగా ప్రతిపాదించారు. కొత్తబడ్జెట్‌ ఈసారి కనీసం 15-20 శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి రాష్ట్ర వృద్ధిరేటు 12శాతంఉంటుందని అంచనా వేస్తున్నారు. జీడీపీ పరిమాణం సుమారు లక్ష కోట్లు పెరిగే అవకాశం ఉన్నందున బహిరంగ విపణిలో తీసుకునే రుణ శాతం కూడా పెరుగుతుంది



మరింత సమాచారం తెలుసుకోండి: