పవన్ కల్యాణ్.. పేరుకు ఈయన ఓ రాజకీయ పార్టీ అధినేతే అయినా.. ఆయనకు ఓ పార్టీ ప్రెసిడెంట్ అనేంత పరపతి రాలేదు. ఇంకా ఆయన్ను టీడీపీకి సపోర్ట్ చేస్తున్న ఓ పార్ట్ టైమ్ పొలిటీషియన్ గానే భావించాల్సి వస్తోంది. అలాగని పవన్ కల్యాణ్ కు రాజకీయంగా అంత ప్రాధాన్యత లేదని మాత్రం అనే పరిస్థితి లేదు. 

ఏపీగా విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కాపులకు అత్యంత కీలకపాత్ర లభించింది. జనాభాపరంగా ఈ సామాజిక వర్గానికి ఉన్న బలం దృష్ట్యా ఆ సామాజిక వర్గ నేతలకు ప్రాధాన్యం పెరిగింది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు పవన్ కల్యాణ్ ను చంద్రబాబు చేరదీయడం కూడా ఆ సామాజిక వర్గ కోణంలోనే జరిగిందన్నది విశ్లేషకుల అభిప్రాయం. 

ఎన్నికల తర్వాత కూడా పవన్ రాజకీయ ప్రస్థానం టీడీపీ అధినేతకు అనుకూలంగానే సాగుతోంది. కానీ లేటెస్టుగా ఆయన ఓ వైసీపీ నేత ఇంటికి వెళ్లడం సంచలనానికి దారి తీస్తోంది.  పవన్ కల్యాణ్ వైసీపీ నేత అంబటి రాంబాబు ఆహ్వానం మేరకు ఆయన కుమార్తె పెళ్లికి వెళ్లారు. గుంటూరులో జరిగిన ఈ వివాహానికి  పవన్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. 

సాధారణంగా పవన్ కల్యాణ్ ఇలా నేతల ఇళ్లలో జరిగే పెళ్లిళ్ళకు పెద్దగా హాజరుకారు. కానీ వైసీపీ నేత అంబటి కుమార్తె పెళ్లికి పవన్ హాజరుకావడం ఇప్పుడు అనేక ఊహాగానాలకు తావిస్తోంది. అంబటి రాంబాబు కాపు నేత కావడం వల్లే ఆయన కుమార్తె పెళ్లికి వెళ్లారా లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో ఊహాగానాలు సాగుతున్నాయి.

మొన్నటి తుని కాపు ఐక్య గర్జన తదనంతర హింసాత్మక ఘటనల తర్వాత మీడియాతో మాట్లాడిన పవన్.. తాను కేవలం కాపులకు మాత్రమే ప్రతినిధిని కానని.. ప్రత్యేకంగా చెప్పారు. ఈ కామెంట్లు ఆ సామాజిక వర్గం వారికి ఆగ్రహం తెప్పించాయి. ఇప్పుడు దాన్ని కవర్ చేసుకునేందుకే పవన్ అంబటి ఇంటికి వెళ్లినట్టు కొందరు భావిస్తున్నారు. మరోవైపు టీడీపీతోనే కాదు.. ఏపీలో ఏ పార్టీ నాయకుడితోనైనా తాను స్నేహం చేయగలనని పసుపుదళానికి క్లారిటీ ఇచ్చేందుకు అంబటి ఇంటికెళ్లారని మరికొందరు అంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: