కేంద్ర బడ్జెట్ అప్పుడు ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్నారు. కేంద్రం బడ్జెట్ విషయంలో తీసుకునే నిర్ణయాలను బట్టి రాష్ట్రాలు ఒక అంచనాకు వచ్చేవిధంగా కనిపిస్తుంది.  ఫిబ్ర‌వ‌రి నెలాఖ‌రులోగా పార్ల‌మెంట్ ముందుకు 2016-17 బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌లు తీసుకువ‌చ్చేందుకు కేంద్ర ఆర్థిక‌ శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ సిద్ధ‌మ‌వుతున్నారు. ఇందుకోసం జైట్లీ ప‌లు శాఖల అధికారుల‌తో స‌మావేశాలు నిర్వ‌హిస్తూ.. బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ సారి బ‌డ్జెట్‌లో మౌలిక వ‌స‌తులు, వ్య‌వ‌సాయం, గ్రామీణ ప్రాంతాల‌లో ఆరోగ్యంతో పాటు బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేసి విస్త‌రించ‌డంపై కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌ధానంగా దృష్టి సారించిన‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

గ్రామీణ ప్రాంతాల్లోని వనరులను సద్వినియోగం చేసుకోవడంతోపాటు, వ్యవసాయ భూముల అభివృద్ధిపై దృష్టి సారించిన ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్‌లో ప్రధానంగా వ్యవసాయం, నీటిపారుదల, గ్రామీణ రోడ్లు, భూసార పరిరక్షణ కార్డుల పంపిణీ తదితర అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. అధికార వర్గాల నుండి అందిన సమాచారం మేరకు 2016-17 కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం చేపడుతున్న ప్రధానమంత్రి కృషి యోజన, రాష్ట్రీయ కృషి సించాయ్ యోజన, ప్రధానమంత్రి గ్రామీణ రహదారుల పథకం, భూసార పరిరక్షణ కార్డులు తదితర పథకాలపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా  గ్రామాల్లో నీటి పారుద‌ల సౌక‌ర్యాల మెరుగుద‌ల‌కు మ‌రిన్ని నిధులు కేటాయించేందుకు జైట్లీ నిర్ణయించినట్లు సమాచారం. మౌలిక రంగంలో రూ. 70 వేల కోట్ల పెట్టుబ‌డుల ఆక‌ర్ష‌ణే ల‌క్ష్యంగా నిర్ణ‌యాలు ఉండబోతున్నట్లు సమాచారం. ఏది ఏమైనా  ప్ర‌భుత్వానికి ఇది కీల‌క‌మైన బ‌డ్జెట్ కావ‌డంతో, ప్ర‌జ‌ల‌కు న‌చ్చేలా దీన్ని రూపొందిస్తున్న‌ట్టు స‌మాచారం. ప్ర‌జ‌ల సేవింగ్స్‌ను పెంచేలా కీల‌క నిర్ణ‌యాల‌ను బ‌డ్జెట్‌లో ప్ర‌తిపాదిస్తామ‌ని ఇప్ప‌టికే జైట్లీ సంకేతాల‌ను పంపిన సంగ‌తి తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: