త్వరలో రైల్వే బడ్జెట్ 2016-17 ప్రవేశపెట్టనున్నారు కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు! ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ చట్టం - 2014లో ఇచ్చిన హామీలను అమలుపరచాలని ఇప్పటికే ఎన్నోసార్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, ప్రతిపక్ష పార్టీలు, మేధావుల నుంచి ఎన్నో విజ్ఞప్తులు వెళ్లినప్పటికీ.. ఇప్పటికీ కేంద్రానికి ఈ విషయంలో ఏపీ అంటే చిన్నచూపే! అయితే ఈసారి ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో అయినా ప్రభు కరుణిస్తారని ఏపీప్రజలు ఎదురుచూస్తున్నారు. రైల్వే బడ్జెట్ లో దక్షిణాది రాష్ట్రాలకు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలపై కేంద్రానిది సవతి తల్లి ప్రేమ అనే విమర్శ ఉంది. ఇప్పటివరకూ రైలెవే బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతీ మంత్రి ఈ విమర్శకు బలం చేకూరుస్తూనే వచ్చారనేదీ జగమెరిగిన సత్యం.  

ఈ క్రమంలో తెలుగువాడి గోడు మరోసారి సురేష ప్రభుకు తెలపాల్సిన అవసరం ప్రభుత్వ పెద్దలపై ఉండటం ఎంత నిజమో, ఆ విన్నపాలు విని, అమలులో పెట్టాల్సిన బాధ్యత సురేష్ ప్రభుపై ఉందన్నది కూడా అంతే నిజం.!  ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, కేంద్ర రైల్వేశాఖ సంయుక్తంగా చేపట్టిన నడికుడి - శ్రీకాళహస్తి ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తిచేయాల్సిన బాధ్యత రైల్వేశాఖపై ఉంది. ఈసారి బడ్జెట్ లో రైల్వే మంత్రి ఈదిశగా ఆలోచించాలని ఏపీవాసులు కోరుతున్నారు.

చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు... ఈ నాలుగు జిల్లాల మీదుగా సుమారు 370 కి.మీ. పొడవున్న ఈ రల్వే లైన్ వస్తే.. హైదరాబాద్ - చెన్నై లకు కూడా ప్రత్యామ్నాయ మార్గంగా ఉపయోగపడుతుందన్న విషయం సదరు మంత్రివర్యులు గ్రహించాలని తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు. ఇదే క్రమంలో అప్పట్లో 2014-15 రైల్వే బడ్జెట్‌లో ఏపీ, తెలంగాణల్లో రూ. 29 వేల కోట్ల అంచనా వ్యయం కలిగిన సుమారు 29 ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని.. వాటిని ఒక సమన్వయ కమిటీ ద్వారా పరిష్కరిస్తామని మంత్రి చెప్పారు.  


2016-17 రైల్వే బడ్జెట్


 ఇప్పటివరకేమీ ఆ పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో జరిగిందేమీ లేదు. ఇదే క్రమంలో విభజన చట్టంలో సీమాంధ్రలో ఒక కొత్త రైల్వే జోన్‌ కు కేంద్రం హామీ ఇచ్చింది. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఆశిస్తున్నది కూడా విశాఖను భారీ రైల్వే జోన్ గా ప్రకటిస్తారనే. అంతేకాకుండా విభజన చట్టంలో పొందు పరిచిన విధంగా కొత్త రాజధాని నుంచి హైదరాబాద్‌కు ర్యాపిడ్ రోడ్ అండ్ రైల్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తామన్న విషయం కూడా సురేష్ ప్రభువారు గమనించగలరనేది ఏపీ ప్రజల విజ్ఞప్తి. ఇటువంటి ఎన్నో విషయాలపై త్వరలో ప్రవేశపెట్టబోయే రైల్వే బడ్జెట్ లో మంత్రి సురేష ప్రభు ఏపీవైపు కూడా చూస్తారని ప్రజలు ఆశిస్తున్నారు! ప్రభూ... ఈ సారైనా కరుణిస్తారా?


మరింత సమాచారం తెలుసుకోండి: