మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ సర్కారు పట్ల ఏమైనా తన దృక్పథాన్ని మార్చుకున్నదా? లేదా? తెలంగాణ ప్రజల పట్ల సానుకూల దృక్పథాన్ని అలవరచుకుంటున్నదా? లేదా? తెలంగాణ ప్రజల మద్దతు, ప్రేమ కూడా తమకు అవసరమే అని.. తమ పాలనలో తెలంగాణ ప్రజలకు న్యాయం చేయడం కూడా ఒక విధి అని వారు ఇప్పటికైనా గుర్తించగలిగే స్థితిలో ఉన్నారా.. లేదా? అనేది మరి కొన్ని రోజుల్లో తేలిపోనున్నది.


రైల్వే బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఎలాంటి కేటాయింపులు ఇవ్వబోతున్నది అనే దానిని బట్టి.. కేంద్రం వైఖరి అర్థం అయిపోతుంది. కాపురం చేసే కళ కాలు తొక్కిన నాడే తెలిసిపోతుందన్న సామెత చందంగా.. ప్రభుత్వం తెలంగాణ పట్ల ఎలాంటి వైఖరితో ఉన్నదనే సంగతి.. రాబోయే అసలు బడ్జెట్‌లో కేటాయింపులు ఎలా ఉంటాయనే సంగతి రైల్వే బడ్జెట్‌లోనే ఉప్పందుతుంది. 


నిజానికి దేశంలోని సరికొత్తరాష్ట్రంగా ఏర్పడినటువంటి తెలంగాణ రైల్వే అవసరాల పరంగా చాలా దయనీయమైన స్థితిలో ఉన్నది. భౌగోళికంగా అటు ఉత్తర భారతాన్ని ఇటు దక్షిణ భారతాన్ని అనుసంధానించే పాయింట్‌లో ఉండడం ఒక్కటే తెలంగాణ ప్రాంతానికి రైల్వే పరంగా ఉన్న సానుకూల అంశం. కేవలం అందువల్ల మాత్రమే.. ఈ రాష్ట్రం మీదుగా కొన్ని జాతీయ రైళ్లు వెళుతున్నాయి తప్ప.. ప్రత్యేకంగా తెలంగాణ కోసం అంటూ కేంద్ర ప్రభుత్వం రైల్వే పరంగా ఇప్పటిదాకా ఒరగబెట్టింది ఏమీ లేదు. పైగా రాష్ట్రం రైల్వే అవసరాల పరంగా, రైల్వే సదుపాయాలను ప్రజలకు మరింత చేరువ చేసుకునే పరంగా చాలా ఎదగవలసి ఉంది.


దీనికి సంబంధించి.. గత ప్రభుత్వాలు ఈ ప్రాంతాన్ని విస్మరిస్తూ వచ్చాయి. మార్గాలు అంత అనువుగా లేవంటూ చిన్న చూపు చూస్తూ వచ్చాయి. కానీ ఇప్పుడు బంగారు తెలంగాణ కోసం ఏర్పడిన తెరాస సర్కారు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఎక్కువ పథకాలు రాబట్టుకునే ప్రయత్నంలో ఉంది. పౌర రవాణా, వస్తు రవాణా అవసరాలతో పాటూ తెలంగాణకు రైల్వే పరంగా చాలా కొత్త ప్రాజెక్టులను, కొత్త లైన్లను ఇక్కడి నాయకులు ఎంపీలు కోరుతున్నారు.


సికింద్రాబాద్ రైల్వే స్టేషన్

రైల్వే ఉత్పాదనలకు సంబంధించిన ఫ్యాక్టరీలను కూడా తెలంగాణలో ఏర్పాటుచేస్తే.. కొన్ని వేల మందికి ఉపాధి దొరకుతుందని విన్నవించుకుంటున్నారు. కొన్ని దశాబ్దాలుగా పెండింగులో ఉన్న భద్రాచలానికి ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌, ఎంఎంటిఎస్‌ విస్తరణ వంటి వినతులు ఎన్నో ఉన్నాయి. అయితే కేంద్రం ఎన్నిటికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తుందన్నది అనుమానమే. తెలంగాణ పట్ల వారు ఎలాంటి వైఖరి అనుసరిస్తారనే దాన్ని బట్టి.. పోరాడి అయినా తమ రాష్ట్రానికి కొత్త సదుపాయాలు సాధించుకోవాలని తెరాస ఎంపీలు కృతనిశ్చయంతో ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: