జగన్ కు అధికారమంటే పిచ్చి.. అధికారం కోసం ఏం చేయడానికైనా వెనుకాడడు.. తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని సీఎం కుర్చీ కోసం సంతకాల రాజకీయం చేశాడు.. ఇలాంటి ఆరోపణలు టీడీపీ ఎప్పటి నుంచో చేస్తూనే ఉంది. మొన్నటికి మొన్న కాపుల రిజర్వేషన్ ఉద్యమం సమయంలోనూ ఇలాంటి డైలాగులే టీడీపీ నేతల నోట వినిపించాయి. 

ఇప్పుడు మరోసారి టీడీపీ నాయకులు జగన్ పై అదే తరహా కామెంట్లు విసురుతున్నారు. కాపుల రిజర్వేషన్ ఉద్యమం సమయంలో అంతా జగనే చేయించాడని డైరెక్టుగా మంత్రులే  విమర్శలు చేశారు. అధికారం కోసం కులాల మధ్య చిచ్చుపెడుతున్నాడని ఘాటుగానే విమర్శించారు. ముద్రగడ పద్మనాభం దీక్ష విరమించకపోతే సీన్ ఎలా ఉండేదో కానీ.. ఆయన దీక్ష విరమించడంతో సీన్ మారిపోయింది. 

కాపుల రిజర్వేషన్ పోరాటం చంద్రబాబు హామీల బుజ్జగింపుతో క్రమంగా చల్లబడింది. కానీ ఇంతలోనే ఇప్పుడు మరో రిజర్వేషన్ పోరు ఆంధ్రా సర్కారును ఇరుకున పెట్టేలా కనిపిస్తోంది. ఎస్సీ వర్గీకరణ విషయంలో చంద్రబాబు వైఖరి మారుస్తున్నారంటూ ఆ సామాజిక వర్గ నేత మంద కృష్ణమాదిగ విరుచుకుపడుతున్నారు. దళితుల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారంటూ ఇటీవల చంద్రబాబు చేసిన కామెంట్లు ఈ వివాదానికి మరింత ఆజ్యం పోశాయి. 

అయితే ఈ విషయంలో జగన్ కు సంబంధం ఉన్నట్టు కనిపించకపోయినా టీడీపీ నేతలు మాత్రం జగన్ నే నిందిస్తున్నారు. కాపులు, బిసిల మాదిరిగానే దళితుల్లోనూ చిచ్చు రేపేందుకు ప్రతిపక్షనేత జగన్ కుట్ర పన్నుతున్నారని మంత్రి రావెల కిషోర్ బాబు విమర్శించారు. కుల రాజకీయాలతో  జగన్ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయడానికి ప్రయత్నిస్తున్నారని రావెల మండిపడ్డారు. 

ఏపీ సర్కారు ఎస్సీ వర్గీకరణకు టిడిపి కట్టుబడి ఉందని మంత్రి రావెల అంటున్నారు. చంద్రబాబు యథాలాపంగా చేసిన కామెంట్లను సాక్షి పత్రిక, మీడియా భూతద్దంలో చూపుతున్నాయని.. ఇదంతా జగన్ కుట్రేనని మంత్రి రావెల అంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: