ఉమ్మడి ఏపీ విభజన జరిగి.. రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఎడ్డెం అంటే తెడ్డెం అంటూ పరస్పరం కీచులాడుకుంటున్న ఆంధ్రా, తెలంగాణ కొన్ని విషయాల్లో మాత్రం ఏకాభిప్రాయానికి వస్తున్నాయి. ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాలు కేంద్రం ముందు ఒకే డిమాండ్ వినిపిస్తున్నాయి. అదే అసెంబ్లీ సీట్ల పెంపు అంశం. సాధ్యమైనంత త్వరగా రెండు రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచాలన్నది వారి డిమాండ్. 

ఇప్పటికే ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. హోంశాఖ మంత్రిని పలుసార్లు కలసి విన్నవించుకున్నారు. ఇప్పుడు కేసీఆర్ కూడా అదే పని చేస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టి.ఎస్‌.ఠాకూర్‌లతో భేటీ అయ్యారు. 

రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం హోం మంత్రిత్వ శాఖ సహా  ఇతర మంత్రిత్వ శాఖల నుంచి రావాల్సిన అంశాలపై కేసీఆర్ వారితో చర్చించారు. అధికారుల విభజన సహా ఇతర అంశాలపై ఏర్పాటైన పలు కమిటీలు నివేదికలు ఇచ్చినా అవి ఏమాత్రం అమలుకు నోచుకోకపోవడాన్ని వారికి గుర్తు చేశారు. కొత్తగా ఏర్పాటైన రాష్ట్రంలో ఐపిఎస్‌ అధికారుల సంఖ్య తక్కువగా ఉందని,  కేంద్రం నుంచి నిబంధనలు సడలించి ఐపిఎస్‌ల సంఖ్యను 141కి పెంచాలని కేసీఆర్ కోరారు. 

ఇక తెలంగాణలో అసెంబ్లీ సీట్ల గురించి కేసీఆర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. వీలైతే.. ఈనెలలో ప్రారంభమయ్యే బడ్జెట్‌ సమావేశాల్లోనే చట్ట సవరణ చేయాలని కోరారు. ఈ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి కూడా చట్టసవరణ చేయాలంటూ లేఖ రాసిన విషయాన్ని కేసీఆర్ హోంమంత్రి దృష్టి తెచ్చారు. ఆ తర్వాత కేసీఆర్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టి.ఎస్‌.ఠాకూర్‌తో భేటీ అయ్యారు. ఉమ్మడి హైకోర్టును విభజించి తెలంగాణ కేసుల విచారణ విడిగా చేపట్టాలని కోరారు. మరి కేసీఆర్ కోరికలు ఎప్పడు నెరవేరతాయో..!



మరింత సమాచారం తెలుసుకోండి: