ఎన్నికల్లో జనాకర్షక పథకాల ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు.. కొన్నిసార్లు కేవలం ఆ జనాకర్షక పథకాలే అధికారం తెచ్చిపెట్టడంలో కీలక పాత్ర పోషిస్తాయి. చరిత్ర పుటలు తిరగేస్తే ఎన్టీఆర్ కు కిలో రెండు రూపాయల పథకం, వైఎస్సార్ కు ఉచిత కరెంటు పథకం అలాంటివే. వీటి ప్రభావంతోనే పాపం చంద్రబాబు కూడా గత ఎన్నికల్లో బోలెడు హామీలు ఇవ్వాల్సి వచ్చింది. 

ఇప్పుడు కేసీఆర్ కు అలాంటి జనాకర్షక పథకమే ఆశలు రేపుతోంది. కేసీఆర్ మానస పుత్రిక లాంటి సదరు ప్రాజెక్టు ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఓట్లు కురిపించేసింది. అందుకే విజయం రుచి మరిగిన కేసీఆర్.. ఆ పథకం అమలుపై సీరియస్ గా దృష్టి సారించారు. తన భవిష్యత్తును కూడా ఆ పథకమే నిర్దేశించగలదని నమ్ముతున్నారు. అదే డబుల్ బెడ్ రూం పథకం. 

అందుకే సీఎం కేసీఆర్.. ఈ డబుల్ బెడ్ రూమ్ పథకంపై విపరీతమైన శ్రద్ధాశక్తులు చూపుతున్నారు. అధికారులతో నిత్యం సమీక్షలు జరుపుతున్నారు. అధికారులు కూడా సీఎం ఇఛ్చిన వాగ్దానాన్ని అమలు పరిచే పనిలో బిజీ అయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులు  తమ పరిధిలో  నిర్మించ‌త‌ల‌పెట్టిన ల‌క్ష రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి కావాల్సిన భూమిని త్వరిత‌గ‌తిన సేక‌రించే పనిలో పడ్డారు. 

ఈ డబుల్ బెడ్ రూమ్ పథకం అమలుకు కీలకమైన అంశాలు రెండు. ఒకటి స్థలం, మరొకటి నిధులు. అందుకే సర్కార్ ఇచ్చిన లక్ష్యం చేరుకోవడానికి వెంటనే త‌మ‌కు భూమలు అప్పగించాల‌ని క‌మిష‌న‌ర్ బి.జ‌నార్థన్‌రెడ్డి రంగారెడ్డి, హైద‌రాబాద్ జిల్లాల‌ రెవెన్యూ అధికారుల‌ను కోరారు. ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే సర్కార్ ఇచ్చిన మాట ప్రకారం ఇళ్లు నిర్మించాలంటే కనీసం 500 ఎక‌రాల భూమి అవ‌స‌ర‌మ‌ట. 

ముందు కనీసం ఓ 50 వేల ఇళ్లు నిర్మించి చూపించాలన్నది కేసీఆర్ తాపత్రయం. అలా చేయలేకపోతే.. విపరీతమైన ఆశలు పెట్టుకుని గద్దెనెక్కించిన గ్రేటర్ జనమే.. ఆ తర్వాత ఓటుతో బుద్ది చెప్పే అవకాశమూ లేకపోలేదు. మరో కీలకమైన సమస్య నిధులు. 

కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోగలమన్న నమ్మకం ఉన్నా.. కేంద్రం సహకరించినా రాష్ట్రం వాటా తక్కువేమీ కాదు. ఇన్ని సమస్యలను అధిగమించి ఈ పథకాన్ని విజయవంతంగా నిర్వహిస్తారా.. లేక జోరు తగ్గి బోల్తాపడతారా అన్నది తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: