మేడారం.. తెలంగాణలోనే.. కాదు కాదు.. దక్షిణ భారత దేశంలోనే అతిపెద్ద గిరిజన ఆధ్యాత్మిక ఉత్సవం. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతర కోసం జరుగుతున్న ఏర్పాట్లు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. మేడారం జాతరకు దాదాపు కోటిన్నర మంది భక్తులు వస్తారని తెలంగాణ సర్కారు అంచనా వేస్తోంది. రెండేళ్ల క్రితం మేడారం జాతరకు 69 లక్షల మంది హాజరయ్యారు. 

రెండేళ్ల క్రితం మేడారం జాతర ఉమ్మడి రాష్ట్రంలో వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరుగుతున్న తొలి మేడారం జాతర ఇది. వారం రోజులుగా రోజూ ఐదు లక్షల మందికి పైగా జాతరకు వస్తున్నారు. అసలైన జాతర మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. మొత్తం నాలుగు రోజుల పాటు ఈ మేడారం జాతర సాగుతుంది. ఈ వారం రోజుల్లోనే కోటి పదిలక్షల మందికి పైగా వస్తారని తెలంగాణ అంచనా వేస్తోంది. 

తొలిసారిగా ఈ మేడారం జాతరకు రైల్వే కూడా ఏర్పాట్లు చేస్తోంది. 16 ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ఇక బస్సుల విషయానికి వస్తే.. మొత్తం 4000 ఆర్టీసీ బస్సులతో పాటు మరో 10 వేల ప్రైవేటు బస్సులు అందుబాటులో ఉంచనున్నారు. ఇవే కాకుండా గాక 50 వేలకు పైగా ప్రైవేటు వాహనాల్లో భక్తులు వస్తారని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ఆర్టీసీ ప్రయాణికుల కోసం మేడారం దగ్గర 50 ఎకరాల్లో బస్ స్టేషన్ ఏర్పాటు చేశారు.

అంతేకాదు.. ఈసారి జాతరకు హెలికాప్టర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. రెండు హెలికాప్టర్లు దాదాపు 50 నుంచి 60 ట్రిప్పులు తిరుగుతాయి. భక్తుల కోసం మంచినీటి నల్లాలు, ప్లాంట్లు, బోర్లతో పాటు ట్యాంకర్లు ద్వారా నీటిని  అందించాలని సూచించింది. ప్రయాణికులకు బాటిళ్ల ద్వారా నీటిని అందించేందుకు  సింగరేణి ముందుకొచ్చింది. 

జాతర జరిగే అటవీ ప్రాంతం తరిగిపోతున్నందున దీని ద్వారా మంచి సందేశం ఇచ్చేందుకు ప్రభుత్వం సంకల్పించింది. జాతర నుంచి ఇంటికి బయలుదేరే భక్తులకు ఒక మొక్కను ఇవ్వనున్నారు. ఈనెల 15 నుంచి దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అక్కడే ఉంటారు. ఈ నెల 19న కేసీఆర్ మేడారం చేరుకొంటారు. తెలంగాణ మొక్కు తీర్చుకుంటారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: