ఆర్టీసీ.. పేరుకు ప్రభుత్వ రంగ సంస్థే అయినా ఉద్యోగుల సౌకర్యాల విషయానికి వచ్చేసరికి కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలు ఎన్నో. ఇటీవల కాస్త జీతాలు పెరగబట్టి గానీ లేకుంటే.. అతితక్కువ వేతనం ఉన్న ప్రభుత్వ ఉద్యోగులెవరైనా ఉంటే అది ఆర్టీసీ ఉద్యోగులే. అంతేకాదు.. సంస్థకు రెండు కళ్లలాంటి డ్రైవర్, కండక్టర్లకు ఉన్నతాధికారుల నుంచి ఎదురయ్యే వేధింపులు ఎన్నో. 

ఏ సంస్థ అయినా సరే ఆన్ డ్యూటీలో గాయాలపాలైనా, వికలాంగులైనా.. తన ఉద్యోగులను ఆదుకుంటుంది. పరిహారం అందిస్తుంది. కానీ ఆర్టీసీ రూటే సపరేటు. ఆర్టీసీ డ్రైవర్లు విధినిర్వహణలో రోడ్డు ప్రమాదానికి గురై.. కాలో, చేయో కోల్పోతే..ఇక వారి పని అంతే సంగతులు. అప్పటివరకూ ఉన్న డ్రైవర్ ఉద్యోగం పోతుంది. అతని ఆరోగ్య పరిస్థితిని బట్టి చిన్న పోస్టులోకి మార్చేస్తారు. 

పోస్టు మారడమే కాదు..అతని జీత భత్యాలు కూడా తగ్గిపోతాయి. విధినిర్వహణలో గాయపడిన మాపై ఈ వివక్ష, అన్యాయం ఏంటంటూ ఆర్టీసీ డ్రైవర్లు కొంత కాలంగా పోరాడుతున్నారు. ఎట్టకేలకు వారి పోరాటం ఫలించింది. ఆర్టీసీలో పనిచేస్తూ వైకల్యం చెందిన డ్రైవర్లకు ఉపశమనం కల్పించేలా హైకోర్టు తీర్పు వెలువరించింది. ఇలాంటి వారందరికీ సమాన హోదా కల్పించాలని ఆదేశించింది.

తక్కువ పోస్టులు కేటాయించి చిన్నచూపు చూడటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు నెలల్లోగా వైక్యలం పొందిన ఆర్టీసీ డ్రైవర్లందరికీ అదే స్థాయిలో శాలరీ చెల్లించాలని తెలుగు రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థలకు హైకోర్టు తేల్చి చెప్పింది. ఏళ్ల తరబడి సేవలందించిన వారిని కంటిచూపు తగ్గిందనో, చేతివేలు తెగిందనో వదిలించుకోవడం సరికాదని కామెంట్ చేసింది.

దిగువస్థాయి పోస్టుల్లో నియమిస్తూ బానిసలుగా చూడటం హక్కులను హరించడమేనని మండిపడింది.  జీతభత్యాల్లో వ్యత్యాసం చూపరదని పేర్కొంది. కోర్టును ఆశ్రయించని వారికి సైతం 8శాతం వడ్డీతో బకాయిలు చెల్లించాలని హైకోర్టు తీర్పు వెలువరించింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: