అవును.. జూనియర్ ఎన్టీఆర్ జరిమానా కట్టారు. హైదరాబాద్ అమీర్ పేట మైత్రీవనం సమీపంలో ఎన్టీఆర్ కారుకు పోలీసులు జరిమానా విధించారు. ఇంతకీ ఎన్టీఆర్ జరిమానా ఎందుకు కట్టారబ్బా... ఆయన డ్రైవర్ కు డ్రైవర్ లైసెన్స్ లేదా.. ట్రాఫిక్ రూల్స్ పాటించలేదా.. ఇంకేదైనా కారణమా అనుకుంటున్నారా.. జూనియర్ ఎన్టీఆర్ కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ వేసుకోవడమే జూనియర్ ఉల్లంఘించిన నిబంధన. 
 
కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ వాడకాన్ని కోర్టు గతంలోనే నిషేధించింది. బ్లాక్ ఫిల్మ్ ఉండటం వల్ల నేరాలు జరిగేందుకు ఎక్కువ అవకాశం ఉందన్న కారణం అందులో ఒకటి. అప్పటి నుంచి హైదరాబాద్ లోనూ కార్లకు బ్లాక్ ఫిల్మ్ వాడకాన్ని నిషేధించారు. ఈ నిషేధం అమలు చేసేందుకు అప్పుడప్పుడు పోలీసులు స్పెషల్ డ్రైవ్ కూడా నిర్వహిస్తున్నారు. 

తాజాగా మైత్రీవనం దగ్గర ఇలాంటి డ్రైవ్ నిర్వహిస్తున్న సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్ కారు వారికి కనిపించింది. సారధీ స్టూడియోలోకి వెళ్తున్న AP 37 AX 9999 నెంబరు గల ఓ కారుకు బ్లాక్ ఫిల్మ్ ఉండటంతో పోలీసులు ఆపారు. రూ. 700 రూపాయల జరిమానా విధించారు. అయితే కారులో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారని.. ఆయన్ను దింపి వచ్చి చలానా కడతానని డ్రైవర్ చెప్పుకొచ్చాడు. 

అయినా పోలీసులు ససేమిరా అన్నారు. ముందు ఫైన్ కట్టాకే కారు కదలాలని సూచించారు. ఇంతలో జూనియర్ వెంటనే డబ్బు కట్టమని చెప్పేయడంతో డ్రైవర్ ఫైన్ కట్టేశాడు. ఇంతలో మీడియా కెమేరాలకు ఈ దృశ్యాలు చిక్కాయి. ఈ తతంగాన్ని షూట్ చేస్తున్న మీడియాపై జూనియర్ డ్రైవర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కారు నుంచే షూట్ చేయవద్దంటూ హెచ్చరించాడు. అయినా షూట్ చేస్తుండటంతో ఆగ్రహంతో ఊగిపోయిన డ్రైవర్ కారు దిగి వచ్చి మీడియాతోనూ గొడవ పెట్టుకున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: