తమిళనాట ఎన్నికల జోరు వేడెక్కుతోంది. మాటల యుద్ధం రోజురోజుకూ ముదురుతోంది. ఎన్నికల ప్రచారంతో పాటు.. విమర్శలు, ఆరోపణలూ  ఉద్ధృతమవుతున్నాయి. ఈసారి అనూహ్యంగా ఎన్నకల్లోకి మద్య నిషేధం అంశం దూసుకొచ్చింది. ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్న కరుణానిధి ఈ అస్త్రాన్ని బయటకు తీశారు. 

మద్య నిషేధ అస్త్రం ప్రయోగించిన కరుణానిధి.. 


జయలలిత సంక్షేమ పథకాలు భారీగా అమలు చేస్తున్న వేళ.. మద్యం అస్త్రంతో దెబ్బకొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఐతే.. జయలలిత మద్య నిషేధంపై కరుణానిధికి చిత్త శుద్ధి లేదంటూ ఎదురుదాడి ప్రారంభించింది. తాజాగా కాంచీపురం సమీపంలో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో డీఎంకే హామీపై జయలలిత విమర్శల వర్షం గుప్పించింది. కరుణానిధి పార్టీ మద్యపాన నిషేధ హామీ జనం విశ్వసించేలా లేదని మండిపడింది. 

మద్య నిషేధం పేరుతో దొడ్డి దారిన ప్రైవేట్ క్లబ్బులు, ప్రైవేట్ దుకాణాల్లో  మద్యపానాన్ని అమ్మించే కుట్రకు కరుణానిధి పాల్పడుతున్నారని ఆరోపించింది. గతంలో డీఎంకే చేసిన ఎన్నికల వాగ్దాలను కరుణానిధి నెరవేర్చలేదని జయ ప్రజలకు గుర్తు చేస్తున్నారు. మళ్లీ మళ్లీ పాత వాగ్దానాలతోనే కరుణానిధి ప్రజలను మోసం చేస్తున్నారని జయలలిత మండిపడింది. 

అమ్మకే అన్నీ తెలుసు అంటున్న జయ..


డీఎంకే పాలనలో ప్రజలకు వేదనే మిగిలిందన్న జయ అందుకు తమ పాలన పూర్తి భిన్నమని చాటుతున్నారు. ఓటమి భయంతో కరుణానిధి గందరగోళంలో పడ్డారని.. పదేళ్ల క్రితం మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాల్నే మరలా ఇప్పుడు  చెబుతున్నారని విమర్శించింది జయ. ఒక్కసారి డీఎంకే పాలన గుర్తు తెచ్చుకోవాలని తమిళ ప్రజలకు గుర్తు చేస్తున్న జయలలిత తన పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారంటోంది. 

తనను తాను అమ్మగా పోల్చుకుంటూ సెంటిమెంట్ పండిస్తోంది. పిల్లలకు అవసరాలు తల్లికే తెలుసన్న జయలలిత.. ప్రజలు ఊహించని విధంగా సరికొత్త పథకాలతో పాలన అందిస్తామంటోంది. గత ఎన్నికల హామీలన్నీ నెరవేర్చామన్న ఆమె.. మళ్లీ అధికారం అప్పగిస్తే మరిన్ని సంక్షేమ పథకాల్ని అమలు చేస్తామని ఊరిస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: