మన ప్రధాని నరేంద్ర మోడీ అంటే మన దేశంలోనే కాదు.. విదేశాల్లోనూ మంచి క్రేజ్ ఉందని కమలనాథులు చెబుతుంటారు. అప్పుడప్పుడూ వెలువడే ఫోర్బ్స్ శక్తివంతుల జాబితాలు, టైమ్ పత్రిక ముఖచిత్రాలు, ఒబామా మెచ్చుకోళ్లు వంటివి.. అబ్బో మన మోడీకి ఎంత క్రేజో అని మనం ఆశ్చర్యపోయేలా చేస్తాయి. కానీ గతంలోలా ప్రస్తుతం మోడీ మానియా నడవడం లేదేమో.. 

ఎందుకని ఆ మాట అంటున్నామంటే..అందుకో కారణం ఉంది. టైమ్ పత్రిక తాజాగా ప్రకటించిన ఈ ఏటి ప్రపంచంలోని అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో మన మోడీకి ఈసారి స్థానమే దక్కలేదు. పోనీ మన కంటే ముదుర్లు ఉన్నప్పుడు మనకు దక్కకపోవడంలో ఆశ్చర్యం ఏముంది అని సరిపెట్టుకుందామంటే.. అదే జాబితాలో మన దేశం నుంచి మరికొందరు ఈ ఘనత సాధించారు. 

గతంలో టైమ్ కవర్ పేజీపై మోడీ.. 


భారతీయ రిజర్వ్  బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్ , టెన్నిస్  స్టార్  సానియా మీర్జా, బాలీవుడ్ నటీమణి ప్రియాంక చోప్రా వంటి వారు కూడా ఈ టైమ్ మ్యాగజైన్ ప్రభావశీ లవ్యక్తుల జాబితాలో ప్లేస్ సంపాదించారు. సాఫ్ట్ వేర్ దిగ్గజం ఇండియన్ అమెరికన్ గూగుల్ సీఈవో సుందర్  పిచాయ్, ఫ్లిప్ కార్ట్  వ్యవస్థాపకులు బిన్నీ బన్సల్, సచిన్  బన్సల్  వంటి వారూ చోటు దక్కించుకున్నారు. 

ఇక ఆర్బీఐ గవర్నర్  రఘురాం రాజన్ ను టైమ్ పత్రిక ఆకాశానికి ఎత్తేసింది. రాజన్ ఓ ఆర్ధిక రుషి అంటూ కితాబిచ్చింది. అలాంటి వారు చాలా అరుదుగా ఉంటారని మెచ్చుకుంది. ప్రపంచ ఆర్ధిక సంక్షోభం, పతనం నుంచి భారత్ ను సరైన దిశలో నడిపిస్తున్న వ్యక్తిగా వివరించింది. మరి ఇంత మందికి చోటు దక్కినా ప్రధానికి చోటు లేకపోవడం చూస్తుంటే.. ఆయన హవా తగ్గిందేమో అనిపించడం లేదూ..!? బహుశా ఈసారి ఆయన "టైమ్" బాగాలేదేమో..!?



మరింత సమాచారం తెలుసుకోండి: