తెలుగు రాష్ట్రాలను ఎండలు వణికిస్తున్నాయి. గుక్కెడు తాగే నీరులేక చాలా ప్రాంతాల్లో కరవు తాండవిస్తోంది. ఇక మన పొరుగున ఉన్న మహారాష్ట్ర కరవు గురించి అందరికీ తెలిసిందే. మొత్తం మీద భారత దేశమంతా వర్షాభావంతో ఇబ్బందిపెడుతోంది. దేశం క్రమంగా కరవు కోరల్లోకి వెళ్తోంది. 

మన పరిస్థితి ఇలా ఉంటే.. అమెరికా పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంది. అక్కడ కొన్ని రాష్ట్రాల్లో వరదలు వణికిస్తున్నాయి. మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో అమెరికాలోని హూస్టన్ నగరం పలు ప్రాంతాల్ని వరదలు ముంచెత్తాయి. అనేక చోట్ల వీధులు సైతం చెరువులను తలపిస్తున్నాయి. 

అక్కడి ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేశారు. భారీవర్షాలతో జన జీవనం స్తంభించిపోతోంది. ప్రధాన రహదారులన్నీ జలమయం అవుతున్నాయి. నదులు పొంగి పొర్లుతున్నందు వల్ల అనేక చోట్ల ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రత్యేకించి హారిస్  కౌంటీ అనే ప్రాంతంపై వరద ప్రభావం చాలా తీవ్రంగా ఉందట. 

ఈ ప్రాంతంలో వర్షాలు, వరదలతో విద్యుత్, రవాణ, సమాచార వ్యవస్థలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పాఠశాలల్ని కూడా మూసివేశారు. వేలాది మందిని సహాయ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తొమ్మిది టెక్సాస్  కౌంటీలలో, టెక్సాస్ లోనూ అత్యవసర పరిస్థితిని ప్రకటించి సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

ఈ ప్రాంతాల్లో తెలుగు వారు ఎక్కువగానే ఉండే అవకాశం ఉన్నందువల్ల మన వాళ్లు ఎలా ఉన్నారో అన్న బెంగ తెలుగు రాష్ట్రాల్లోని వారికి ఆందోళన కలిగిస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: