పూర్తిగా ఊపిరిపోసుకోకముందే ఆంధ్రా రాజధాని అమరావతి అనేక దిగ్గజ సంస్థలకు వేదికగా మారబోతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  వైద్య, విద్యా, విజ్ఞాన కేంద్రంగా అమరావతి  రూపొందనుంది. నవ్యాంధ్ర రాజధానిలో ఇండో యుకె ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ కింగ్స్ కాలేజీ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ స్థాయి ఆస్పత్రిని నిర్మించేందుకు సన్నాహాలు 
చేస్తోంది. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత ఏపీ కోల్పోయిన వాటిలో ముఖ్యమైనవి వైద్య సేవలు. హైదరాబాద్ లో ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందుతుంటే.. ఏపీకి 
అలాంటి ఆసుపత్రులు లేవన్న లోటు ఉండేది. ఆ లోటు తీర్చేందుకు ఇప్పుడు రంగం సిద్ధమవుతోంది. ఆంధ్రా రాజధాని అమరావతిలో వేయి కోట్ల పెట్టుబడితో, పదకొండు 
వందల పడకలతో  అధునాతన ఆస్పత్రి ఏర్పాటుకాబోతోంది. 

ఇండో యుకె ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ కింగ్స్ కాలేజీ ఆధ్వర్యంలో దేశంలో మరో 10 ఆసుపత్రులు రూపుదిద్దుకోబోతున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. వాటన్నిటి 
కార్యకలాపాలకు  అమరావతి హెడ్ క్వార్టర్స్ గా ఉండబోతోంది. మంగళవారం సీఎంఓలో ముఖ్యమంత్రి చంద్రబాబు యూకే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రతినిధులతో ఈమేరకు 
సమావేశం నిర్వహించారు. 

కింగ్స్ కాలేజ్ ప్రతినిధులు తమ మాస్టర్ కాన్సెప్ట్ మీద ప్రెజెంటేషన్ ఇచ్చినప్పడు ముఖ్యమంత్రి ఎంతో ఆసక్తిగా విన్నారు. అమరావతిలో కేవలం ఒక్క ఆస్పత్రి నిర్మిస్తే విశేషం 
కాదని, కేంద్రప్రభుత్వం యూకేతో చేసుకున్న ఒప్పందం మేరకు మనదేశంలో వివిధ రాష్ట్రాలలో 11 వైద్య విజ్ఞాన సంస్థలు, మెడికల్ కాలేజీలు ఏర్పాటవుతాయని, ఈ సంస్థల 
కార్యకాలాపాలకు అమరావతి కేంద్రం అవ్వనుందని  ముఖ్యమంత్రి చెప్పారు. ఇందుకోసం తాను తీవ్ర కృషి చేస్తున్నట్లు వివరించారు. 

11 సంస్థల కేంద్ర కార్యాలయాలు అమరావతిలో నెలకొల్పితే అనుబంధ రంగ పరిశ్రమలు ఏర్పాటవుతాయని, రెండు లక్షల ఉద్యోగావకాశాలు లభిస్తాయని చెప్పారు. 
అమరావతిలో కింగ్స్ కాలేజీ సహకారంతో  ఇండో యూకే హెల్త్ ఇన్‌స్టిట్యూట్ నెలకొల్పనున్న ప్రపంచ స్థాయి ఆస్పత్రి నిర్మాణానికి జూన్ 5 వ తేదీన ప్రధాని నరేంద్రమోడీ 
శంకుస్థాపన చేయనున్నారు. శంకుస్థాపన జూన్ 5న ప్రధానికి వీలుకాని పక్షంలో జూన్9 కి శంకుస్థాపన తేదీ మారే అవకాశాలున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: