సిరిగల శ్రీనివాసుడు.. ఇప్పుడు తానే సిరిగలవారికి చెంతకు చేరుకుంటున్నాడు. ఔను.. తెలుగు రాష్ట్రాల్లోని ధనవంతుల కేరాఫ్ అడ్రస్ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ అన్న సంగతి తెలిసిందే. ఈ రెండు ప్రాంతాల్లో ఇల్లు ఉండటం ఓ స్టేటస్ సింబర్. కోటీశ్వరులకు తప్ప సామాన్య జనానికి అక్కడ చోటు ఉండదు. అలాంటి ఖరీదైన ప్రాంతంలో ఇప్పుడు ఏడుకొండల శ్రీనివాసుడు కొలువుదీరబోతున్నాడు. 

టిటిడి ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ మేరకు ఓ నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో శ్రీనివాసుని ఆలయం నిర్మించాలని ప్రాధమికంగా నిర్ణయించినట్టు సమావేశం తర్వాత టీటీడీ ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి మీడియాకు తెలిపారు. ఇందుకు దాదాపు 18 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నామని తెలిపారు. 

టీటీడీ ఇలా తిరుమల వెలుపల ఆలయాలు నిర్మించడం కొత్తేమీ కాదు.. దేశవ్యాప్తంగా టీటీడీ ఇలా బాలాజీ ఆలయాలు అనేక చోట్ల నిర్మించింది. ఇప్పటికే బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ ప్రాంతంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయం ఇందులో ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత దైవసన్నిథానం పేరట అనేక ఆలయాల సమాహారమే ఉంది. 

కొన్నేళ్ల క్రితం ఒడిషాలోని పూరీ దేవాలయం తరహాలో బంజారాహిల్స్ లో కూడా జగన్నాథస్వామి ఆలయాన్ని ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భవనం పక్కనే ఈ ఆలయం ఉంది. ఇప్పుడు తాజాగా ఏడుకొండలవాడి ఆలయం కూడా త్వరలో కొలువుదీరబోతోందన్నమాట. మొత్తానికి బంజారాహిల్స్ భక్తి కేంద్రంగా కూడా మారిపోతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: