చట్టం ముందు అందరూ సమానులే. చట్టం ఎవరికీ చుట్టం కాదని నిరూపించింది రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం.  ఒక ఎమ్మెల్యే నిబంధనలను అతిక్రమించి కట్టిన భవనాన్ని కూల్చేయాలని ఆదేశించింది. ఈ తీర్పుతో హై కోర్టు ఆ ఎమ్మెల్యే కు షాక్ ఇచ్చినట్లు అయింది. ఇటీవలే అధికార తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన,
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఆయన కుటుంబ సభ్యులు నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేయాలని జిహెచ్ఎంసి అధికారులను హైకోర్టు ఆదేశించింది. కుత్బుల్లాపూర్ గ్రామంలోని సర్వే నంబర్ 79 నుంచి 82 వరకు ఉన్న స్థలంలో నిర్మించిన వాణిజ్య భవనం పూర్తిగా అక్రమమేనని హైకోర్టు పేర్కొంది.

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే గృహ నిర్మాణ అనుమతితో వాణిజ్య భవనాన్ని నిర్మించి ఓ విద్యా సంస్థకు లీజుకు ఇచ్చారని, పైగా నిబంధనలు పాటించలేదని స్వయంగా ఆయన పినతండ్రి కెఎం ప్రతాప్ గత ఏడాది హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. తద్వారా కార్పోరేషన్‌కు రూ.60 లక్షల రుసుము ఎగవేశారని పేర్కొన్నారు. వ్యాజ్యాన్ని విచారించిన న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

బంధనలకు విరుద్ధంగా సెట్‌బ్యాక్ లేకుండా, పార్కింగ్ ఏర్పాట్లు లేకుండా నిర్మించిన భవనాన్ని కూల్చి వేయాలని జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలోని న్యాయస్థానం ఉత్తర్వులు వెలువరించింది. సోమవారమే ఉత్తర్వులు వెలువరించినప్పటికీ, తీర్పు ప్రతి మంగళవారం అందుబాటులోకి వచ్చింది.

ఈ భవనంలో కొనసాగుతున్న విద్యాసంస్థల్ని జూన్ 1 వ తేదీ నాటికి ఖాళీ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో నారాయణ విద్యా సంస్థలు కూడా ఉన్నాయి. వాటికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అక్రమ నిర్మాణాలను కూల్చివేసి నివేదికను, ఫొటోలను జూన్ 15 నాటికి హైకోర్టు రిజిస్ట్రార్‌కు సమర్పించాలని జిహెచ్ఎంసి అధికారుల్ని ఆదేశించింది. అంతేకాకుండా అక్రమనిర్మాణం జరుగుతున్నప్పుడు ఉదాసీనంగా వ్యవహరించిన అధికారులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: