ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి నిర్మాణం శరవేగంగా సాగుతోంది. రాజధాని ప్రాంతంలో తొలి కట్టడంగా ప్రారంభమైన తాత్కాలిక సచివాలయ భవనాలు రికార్డు స్థాయి వేగంతో నిర్మాణాలు జరుగుతున్నాయి. ముందుగా అనుకున్న సమయం కన్నా ముందే అన్ని హంగులతో స్వాగతం పలికేందుకు ఈ తాత్కాలిక సచివాలయం రెడీ అవుతోంది. 

ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు తన కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించేశారు. అక్కడ నుంచి అధికారిక కార్యక్రమాలు కొనసాగేలా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం మీద మరో నెలన్నర రోజుల్లో ఇక్కడ మొత్తం కార్యాలయాలన్నీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇదే వేగం కొనసాగిస్తూ జీ ప్లస్‌ వన్‌ నిర్మాణాలకు  కొనసాగింపుగా  ప్రతి భవనంపైనా  మరో రెండు అంతస్తుల నిర్మాణానికి కూడా ప్రభుత్వం టెండర్లు పిలిచింది. 

నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.. ఎంత వేగవంతంగా చేస్తున్నారనడానికి తాత్కాలిక భవనం మొదటి అంతస్తు శ్లాబు నిర్మాణమే ఓ ఉదాహరణ. దీన్ని కేవలం 11గంటల వ్యవధిలో 50 కాంక్రీట్‌ లారీలను వినియోగించి రికార్డుస్థాయిలో పని పూర్తి చేశారు. ఈ అంతస్థులో సీఎం ఛాంబర్ తో పాటు 70మందికి పైగా కూర్చునే వెసులుబాటు ఉన్న సమావేశ మందిరం రానున్నాయి. 

ప్రతి భవనంలోను ఆరు లిఫ్ట్ లు ఉంటాయి. మొదటి భవనంలో మాత్రం ముఖ్యమంత్రి కోసమే ఒక లిఫ్ట్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు.  మరో వైపు ఎల్ అండ్ టీ సంస్థ మూడు, నాలుగు, అయిదు, ఆరు భవనాలకు సంబంధించి శరవేగంగా పనులు చేస్తోంది. అసెంబ్లీ, మండలి కి సంబంధించిన ఆరో భవనం డిజైన్ ఇటీవలే ఆమోదం పొందటంతో దీని నిర్మాణం జూలైలో పూర్తి కానుంది. మొత్తం మీద ఇంత వేగంగా రూపుదిద్దుకున్న రాజధాని ఇదేనేమో..!?


మరింత సమాచారం తెలుసుకోండి: