ఏపీ రాజధాని అమరావతిని నవ నగరాలుగా అభివృద్ధి చేయాలని టీడీపీ సర్కారు భావిస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పుడు వాటికి తోడు మరో సిటీ రాబోతోంది. అదే్ బ్రాండ్ సిటీ.. రాష్ట్రంలో బ్రాండ్‌ సిటీ ఏర్పాటుకు గల అవకాశాలను ఏపీ ప్రభుత్వం పరిశీలిస్తోంది. బ్రాండ్‌ సిటీ ఫెసిలిటేటర్స్‌గా వ్యవహరించడానికి రిక్‌ కార్డిన్‌ నేతృత్వంలోని హార్వర్డ్‌ స్క్వేర్‌ టెక్నాలజీ పార్ట్‌నర్‌ ప్రతినిధి బృందం ముందుకొచ్చింది. 

ఈ బృందంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఆయన క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. బ్రాండ్‌ సిటీ ఏర్పాటుపై ముఖ్యమంత్రికి బృందం డెమో చూపించింది. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృధ్ధి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను బృందానికి వివరించారు. నవ్య ఆలోచనలు, వినూత్న ఆవిష్కారాలను స్వాగతిస్తానని ముఖ్యమంత్రి చెప్పారు.

ప్రపంచంలో మేలిమి రకాల ఉత్పత్తులన్నింటినీ, ముఖ్యంగా అగ్రశ్రేణి  ఫార్చూన్ విభాగంలో 500 ఉత్పత్తుల్లో 100 ఉత్పత్తులను ఒకే చోటికి తెచ్చి ఏర్పాటు చేసే వర్చువల్ సిటీ బ్రాండ్ సిటీ. ఈ సిటీ దేశానికే కాకుండా,  ప్రపంచంలోనే అద్భుతంగా మిగిలిపోతుందని అంచనా. బ్రాండ్ సిటీ ఏర్పాటయితే ఏటా 20 లక్షల మంది హైనెట్ వర్క్ గ్లోబల్ విజిటర్స్ సందర్శించి కొనుగోలు చేస్తారు. 

నిత్యం లక్షమంది సాధారణ సందర్శకులు ఈ బ్రాండ్ సిటీకి వస్తారు. లక్షమందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. బ్రాండ్ సిటీలో అంతర్జాతీయ హోటళ్లు, గోల్ఫ్ కోర్సులు, క్రీడా విభాగానికి చెందిన ఇతర సదుపాయాలు ఉంటాయి. ప్రపంచ స్థాయి కంపెనీలు బిలియన్ల డాలర్లను పెట్టుబడి పెడతాయని, తాము ఒప్పించి తీసుకువచ్చి బ్రాండ్ సిటీ ఏర్పాటుకు సహకరిస్తామని హార్వార్డ్ స్క్వేర్ టెక్నాలజీ పార్ట్‌నర్స్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. 

ఈ సమావేశంలో హార్వార్డ్ స్క్వేర్ టెక్నాలజీ పార్ట్‌నర్స్ ప్రతినిధి అజయ్ పరమార్ , సీఎంఓ అదనపు కార్యదర్శి అడుసుమల్లి రాజమౌళి, తదితరులు పాల్గొన్నారు. పారిశ్రామిక కారిడార్లతో రాష్ట్రంలో పెట్టుబడులకు పారిశ్రామికాభివృధ్ధికి ఇతోధిక అవకాశాలున్నాయని సీఎం వారికి తెలిపారు. పారిశ్రామిక కారిడార్లు బ్రాండ్‌ సిటీ ఏర్పాటకు అనువుగా ఉంటాయని చెప్పారు. చెన్నయ్  పోర్టుకంటే కృష్ణపట్నం పోర్టు ఎగుమతులు, దిగుమతులు, వాణిజ్యానికి సౌలభ్యంగా ఉంటుందని వివరించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: