ఏపీ సీఎం చంద్రబాబు అక్రమాలు - అవినీతి అంటూ ఎంపరర్ ఆఫ్ కరప్షన్ పుస్తకంతో ఢిల్లీలో ప్రచారం చేస్తుండటాన్ని టీడీపీ యువనేత, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి లోకేశ్ ఘాటుగా తిప్పికొట్టారు. అందులోనూ జగన్ టీమ్ రూపొందించిన పుస్తకంలో పలుసార్లు లోకేశ్ పేరు ఉండటం విశేషం. దీనిపై స్పందించిన లోకేశ్.. తాను పుట్టే సమయానికే.. తన తాత ముఖ్యమంత్రిగా ఉన్నారని గుర్తు చేశారు. 

తన తాత.. ఆ తర్వాత తన తండ్రి రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేశారంటూ లోకేశ్ జగన్ కు ఫ్లాష్ బ్యాక్ విప్పి చెప్పే ప్రయత్నం చేశారు. తాత, తండ్రి గతంలోనే ముఖ్యమంత్రిగా ఉన్నా తనకు ఏనాడూ డబ్బు వ్యామోహం లేదని వివరించారు. అప్పుడు లేని డబ్బు వ్యామోహం .. ఇప్పుడెక్కడి నుంచి వస్తుంది తమ్ముళ్లూ అంటూ తనదైన శైలిలో  ప్రశ్నించారు.

రాష్ట్రంలో పార్టీ ఖాళీ అవుతుండటంతో.. జగన్ కు దిక్కుతోచక.. ఢిల్లీ పచార్లు చేస్తున్నారని లోకేశ్ ధ్వజమెత్తారు. ఇక జగన్ పార్టీలో ఎవరూ మిగలరని.. జగన్ వెంట నిలిచేది.. జగన్ తో పాటు.. కోర్టుకు వెళ్లే ముద్దాయిలు మాత్రమేనని లోకేశ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధ్యక్షుడు జగన్  అహంకార పూరిత ధోరణే ఇందుకు కారణమని లోకేశ్ చెప్పుకొచ్చారు. 

జగన్ దేశంలోనే అత్యంత అసమర్థుడైన ప్రతిపక్షనేత అంటూ లోకేశ్ సెటైర్లు వేశారు.  దమ్ము, ధైర్యం ఉంటే.. నేను అవినీతికి పాల్పడినట్లు మీ దగ్గర ఆధారాలు ఉంటే బహిరంగ చర్చకు నేను సిద్ధమే.. మీరు సిద్ధమేనా?’’ అని  జగన్మోహనరెడ్డికి నారా లోకేశ్‌ సవాల్‌ విసిరారు. రాయలసీమ బిడ్డవై కూడా పట్టిసీమకు అడ్డుపడతావా?’ అని ప్రశ్నించారు. అమరావతిలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని విపక్ష నేత దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. బుధవారం విశాఖలో టీడీపీ కార్యాలయ భవన నిర్మాణానికి లోకేశ్‌ శంకుస్థాపన చేశారు .



మరింత సమాచారం తెలుసుకోండి: