ఏపీ బ్రాండ్‌ ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు కొంత మంది ప్రయత్నాలు చేస్తున్నారని సీఎం చంద్రబాబు పరోక్షంగా ప్రతిపక్ష నేత జగన్‌ను విమర్శించారు. ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ బుధవారం టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా విజయవాడలో జరిగిన సభలో సీఎం మాట్లాడారు. చైనా, జపాన్‌ వంటి దేశాలకు చెందిన కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఏపీకి వస్తున్నాయన్నారు. ఇలాంటి సమయంలో రాజకీయాలకు ప్రాధాన్యమిస్తే చాలా సమస్యలు వస్తాయన్నారు. రాష్ట్రంలో కొంతమంది ఇదే పనిలో ఉన్నారని ఆరోపించారు. రాజధానిలో లక్షకోట్ల అవినీతి జరిగిందని కొందరు ఆరోపిస్తున్నారని, ఎక్కడ జరిగిందో చూపాలని చంద్రబాబు కోరారు. రాజధాని కోసం రైతుల భూమిని సమీకరించి, దాన్ని అభివృద్ధి చేసి తిరిగి వారికి ప్లాట్లు ఇస్తున్నాం.. ఇందులో అవినీతి ఏముందని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన ఆరోపణలకు సీఎం పైవిధంగా స్పందించారు.

 

 గతంలో తాను ప్రపంచం మొత్తం తిరిగి భారతదేశం అంటే ఆంధ్రప్రదేశ్‌ అనే స్థాయికి తీసుకువచ్చానని గుర్తు చేశారు. కానీ ఆతర్వాత వచ్చిన నాయకులు రాషా్ట్రన్ని భ్రష్టుపట్టించారని, అధికారులను, పారిశ్రామికవేత్తలను జైలుకు వెళ్లేలాచేసి రాష్ట్రానికి చెడ్డపేరు తెచ్చారన్నారు. మళ్లీ ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూసే పరిస్థితిని తీసుకువచ్చామన్నారు. రాష్ట్రంలో ఏ రాజకీయ నాయకునికి ఇవ్వని గౌరవాన్ని ప్రజలు తనకిచ్చారని, దాన్ని తన జీవితంలో మరచిపోలేనని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజలు కష్టాల్లో ఉంటే తాను భరించలేనన్నారు. తనను నమ్మిన రైతులకు అన్యాయం జరగనివ్వబోనని చెప్పారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు వచ్చే నెలలోనే ప్లాట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. తాను అన్ని విషయాల్లో పారదర్శకంగా పనిచేస్తున్నా కొంతమంది నాయకులు అభివృద్ధిని అడ్డుకొనేలా వ్యవహరిస్తున్నారని.. ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ‘ఒక పద్ధతి ప్రకారం.. మనస్సాక్షిగా పని చేస్తున్నపుడు.. ఇలాంటి ఆరోపణలు నన్ను ఏమీ చేయలేవు.. నీతి నిజాయితీగా పని చేస్తున్నప్పుడు ప్రజాస్వామ్యంలో ఇలాంటి బాధాకరమైన విమర్శలు భరించాల్సి ఉంటుంది. అలా అని ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు.

 

నిప్పులా ఉంటాను కాబట్టే.. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, సోనియా గాంధీ, వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి.. ఎవ్వరూ తనను ఏమీ చేయలేకపోయారని సీఎం వ్యాఖ్యానించారు. గతంలో వైఎస్‌ ప్రభుత్వ హయాంలో తనపై 25 విచారణలు జరిపించారని గుర్తు చేశారు. తనకు ఏ బలహీనతలూ లేవని, అదే తన బలమన్నారు. అవినీతి కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చిన వ్యక్తి.. ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవుతున్న వ్యక్తి తనపై ఆరోపణలు చేస్తున్నారని, బాధగా ఉన్నా ప్రజల కోసం విమర్శలను భరించాల్సి వస్తోందని సీఎం వ్యాఖ్యానించారు. రాజధాని భూముల విషయంలో రైతులకు మేలు జరుగుతున్నా ప్రతిపక్షాలు దారుణంగా ప్రవర్తిస్తున్నాయన్నారు.కులాలు, మతాల మధ్య చిచ్చుపెడుతున్నాయన్నారు. దీనిపై ప్రజలే ఆలోచించాలని కోరారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: