భారత కీర్తి పతాకాన్ని ప్రపంచం నలుమూలల తెలిపే రంగం అంతరిక్ష రంగం. అందుకే భారత్ ఈ రంగంపై మొదటి నుండీ ప్రత్యేక  దృష్టిని కేంద్రీకరించింది. స్వాతంత్రానంతరం ఏర్పాటు అయి భారత అభివృద్ధిలో ప్రధాన పాత్రను పోషిస్తోన్న రంగం అంతరిక్ష రంగం. అందులో ప్రత్యేకతను చాటుకొంది మన తెలుగు రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం. ఇప్పటివరకు ఎన్నో పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ద్వారా ఎన్నో ఉపగ్రహాలను అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశపెట్టిన అనుభవం దీని సొంతం. నేడు మారో రికార్డును నెలకొల్పడానికి సిద్ధం అవుతోంది షార్క్.

 

 శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగవేదిక నుంచి గురువారం మధ్యాహ్నం 12.50 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ-33 ఉపగ్రహ వాహకనౌకను ప్రయోగించేందుకు మంగళవారం ఉదయం 9.20 గంటలకు నిర్వహించిన కౌంట్‌డౌన్ కొనసాగుతోంది. 51.30 గంటల కౌంట్‌డౌన్‌లో భాగంగా మంగళవారం నాలుగోదశలో ద్రవ ఇంధనాన్ని, బుధవారం రెండోదశలో ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను పూర్తి చేశారు. గురువారం ఉదయాన్నే రాకెట్‌కు హీలియం, నైట్రోజన్ గ్యాస్‌లు నింపడంతోపాటు రాకెట్‌లోని అన్ని ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వ్యవస్థలను అప్రమత్తం చేస్తారు.


అనంతరం తుది విడత తనిఖీలు నిర్వహించి గురువారం మధ్యాహ్నం 12.50 గంటలకు పీఎస్‌ఎల్‌వీ సీ-33 రాకెట్ ద్వారా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ సిరీస్‌లో ఆఖరిది, ఏడవదైన (1,425 కిలోలు) ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1జీ ఉపగ్రహాన్ని 20:19 నిమిషాలకు పెరిజీ (భూమికి దగ్గరగా) 286 కిలోమీటర్ల ఎత్తులో, అపోజి (భూమికి దూరంగా) 20,657 కిలోమీటర్లు ఎత్తులోని భూ బదిలీ కక్ష్యలోకి 17.82 డిగ్రీల దీర్ఘ వృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. ఈ పనులను పర్యవేక్షించేందుకు ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ బుధవారం సాయంత్రం షార్‌కు చేరుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: