ఇద్దరు చరిత్ర రచయితలకు మాత్రం భగత్ సింగ్ 'విప్లవ ఉగ్రవాది'గా కనిపించారు. అందులో ఒకరు పేరున్న చరిత్ర రచయితే..ఆయన పేరు బిపిన్‌ చంద్ర, మరొకరు మృదులా ముఖర్జీ. వీరిద్దరూ రాసిన పుస్తకం టైటిల్‌ 'ఇండియాస్‌ స్ట్రగుల్‌ ఫర్‌ ఇండెపెండెన్స్‌'. వలసపాలన నుంచి మాతృదేశ విముక్తి కోసం తన ప్రాణాలనే పణంగా పెట్టిన యోధుడు ఆయన. స్వాతంత్య్రోద్యమకాలం నుంచీ నేటి వరకూ ఈ దేశ యువత ఆయణ్ని విప్లవ యోధుడిగానే అభిమానించింది, ఆరాధించింది. గొప్ప దేశభక్తుడిగా అందరి అభిమానాన్నీ చూరగొన్నారు భగత్‌సింగ్‌.

 

ఇందులోని 20వ అధ్యాయంలో భగత్‌సింగ్‌తోపాటు చంద్రశేఖర్‌ ఆజాద్‌, సూర్యసేన్‌, ఇంకా కొందరు విప్లవ యోధులను విప్లవ ఉగ్రవాదులుగా పేర్కొనడం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నది. విప్లవకారులకూ- ఉగ్రవాదులకూ తేడా తెలియనివాళ్లు చరిత్ర రచన ఎలా చేశారు. వాళ్లు చేస్తే చేశారు..అదే పుస్తకాన్ని ఢిల్లీ యూనివర్సిటీవారు తమ విద్యార్థులకు రెఫరెన్స్‌ బుక్‌గా ఎలా సూచించారు. ఇవే ప్రశ్నలు వేస్తూ..భగత్‌సింగ్‌ కుటుంబసభ్యులు హెచ్‌ఆర్‌డీ మంత్రి స్మృతీ ఇరానీకి లేఖ రాశారు. బుధవారం ఢిల్లీ యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ యోగేష్‌ త్యాగీని కలిశారు.

 

 అయితే, ఇది టెక్స్ట్‌ బుక్‌ కాదు, రెఫరెన్స్‌ బుక్‌ మాత్రమే అన్న త్యాగీ, దీనిపై పరిశీలన జరిపి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. భగత్‌సింగ్‌కు ఉరిశిక్ష విధించిన బ్రిటీష్‌ కోర్టు కూడా నిజమైన విప్లవకారుడిగా పేర్కొందని ఆయన బంధువు అభరుసింగ్‌ సంధూ అన్నారు. బ్రిటీష్‌ పోలీస్‌ అధికారి శాండర్స్‌ను హతమార్చడాన్ని ఉగ్రవాద చర్యగా ఆ పుస్తకంలో పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో అతివాద నేతగా పేరున్న లాలాలజపతిరారు 1928లో సైమన్‌ కమిషన్‌కు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహిస్తుండగా పోలీస్‌ అధికారి జేమ్స్‌ ఏ స్కాట్‌ ఆదేశాలమేరకు జరిగిన లాఠీ చార్జిలో తీవ్రంగా గాయపడ్డారు.

 

గాయాల వల్లే అనారోగ్యానికి గురై లజపతిరారు మరణిం చారు. అందుకు ప్రతీకారంగా భగత్‌సింగ్‌ బృందం పొరపాటున శాండర్స్‌ను స్కాట్‌గా భావించి హతమార్చింది. బిపిన్‌ చంద్రకు ఈమాత్రం చరిత్ర తెలియదనికాదు.. భగత్‌సింగ్‌ పట్ల వారి విశ్లేషణలోనే లోపం ఉంది. యూపీఎస్‌సీ పరీక్షలోనూ భగత్‌సింగ్‌ విప్లవ ఉగ్రవాదం గురించి వివరించండంటూ ఓ ప్రశ్న అడిగారట. వారూ ఈయన పుస్తకాన్నే రెఫరెన్స్‌ గా తీసుకొని ఉంటారు. యూపీఏ హయాంలో 2004 నుంచి 2012 వరకూ నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌కు బిపిన్‌చంద్ర ఛైర్మన్‌గా ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: