వైసీపీ అధినేత జగన్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఓ వైపు నుంచి ఎమ్మెల్యేలు టీడీపీలోకి క్యూ కడుతుంటే.. మరోవైపు సీనియర్ నాయకులు కూడా టాటా చెప్పేస్తున్నారు. తాజాగా సీనియర్ నేత మైసూరారెడ్డి జగన్ పార్టీకి గుడ్ బై చెప్పారు. వెళ్తూ వెళ్తూ చాలా ఘాటు ఆరోపణలు చేసి వెళ్లారు. 

అయితే పార్టీ నుంచి వెళ్లిపోయేవారు ఆరోపణలు చేయడం కొత్త విషయమేమీ కాదు. అది చాలా రొటీన్.. అందులోనూ మైసూరా రెడ్డి చేసిన ఆరోపణలు కూడా చాలా రొటీన్ ఆరోపణలే. జగన్ ఎవరి మాటా వినడు.. జగన్  పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదు. జగన్ ఎవరి సలహాలూ తీసుకోడు.. ఇలాంటి ఆరోపణలు వినడం మనకు కొత్తేమీకాదు.

కానీ మైసూరారెడ్డి మరో ఆసక్తికమైన విషయం లేవనెత్తారు. జగన్ కుటుంబాల మధ్య చిచ్చుపెట్టే కుతంత్రం చేస్తున్నారని మైసూరా ఆరోపించారు. చివరకు కుటుంబ సభ్యుల మధ్య కూడా జగన్ చిచ్చుపెడుతున్నారని ఘాటు పదజాలంతో ఆరోపించారు. ఈ ఆరోపణలు మైసూరారెడ్డి ఎవరిని ఉద్దేశించి చేశారన్నది మాత్రం అంతుబట్టడం లేదు. 

మైసూరారెడ్డి కుటుంబంలో జగన్ చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించారా.. లేక మైసూరారెడ్డి ఆప్తులకు సంబంధించిన కుటుంబాల్లో జగన్ చిచ్చు పెట్టారా.. సాధారణంగా అలాంటి పరిస్థితులు ఇంతవరకూ కనిపించలేదు. పోనీ.. వీరు కాకుండా వైసీపీలోని ఇతర నేతల కుటుంబాల్లో జగన్ చిచ్చుపెట్టారా.. అన్నది అంత అర్థంకాని విషయమే. జగన్ గురించి ఇలాంటి ఆరోపణలు రావడం ఇదే ప్రథమం. మరి జగన్ ఎవరి ఇంట్లో చిచ్చుపెట్టారో.. తెలియాలంటే.. బాధితులే బయటకు రావాల్సి ఉంటుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: