వైసిపిలో తన చేరిక పైన మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలను బట్టి తనకు అసలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే ఉద్దేశ్యమే లేదన్నట్లుగా మాట్లాడారు. తనను వైసిపిలోకి చేర్చుకునేందుకు పలువురిని జగన్ మధ్యవర్తులుగా పంపించారని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బుధవారం నాడు రాజీనామా చేసిన మైసూరా రెడ్డి ఆ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో తాను ఎలాంటి పరిస్థితుల్లో వైసిపిలో చేరానో కూడా చెప్పారు. ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి.


అయితే, అయినా సమయంలో పార్టీ మారి చెడ్డపేరు తెచ్చుకోవడం ఎందుకని తాను భావించానని, పార్టీ మారకపోయినా ఫరవాలేదని, ఆయనతో ఓసారి మాట్లాడాలని సూచించారని చెప్పారు. దానికి సరేనని తాను చెప్పానని మైసూరా రెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో తాను ఓసారి జగన్ ఇంటికి ఫలహారం (టిఫిన్) కోసం వెళ్లానని, అయితే, అప్పటికప్పుడు తన అనుమతి, ప్రమేయం లేకుండానే తన మెడలో పార్టీ కండువా వేశారని మైసూరా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చర్యతో తాను అయోమయంలో పడిపోయానన్నారు. అప్పటికే తనను తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు టీవీల్లో వచ్చిందని, తన ప్రమేయం లేకుండానే అంతా జరిగిపోయిందని చెప్పారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉండాల్సి వచ్చిందని మైసూరా రెడ్డి అన్నారు.

తాను 2012లో పార్టీలో చేరినప్పుడు మనతో పాటు పలువురు నాయకులు ఉన్నారని, తనకు పార్టీ కండువా కప్పారని, తనకు ఆలోచించుకునే సమయం కూడా ఇవ్వలేదని, తప్పని పరిస్థితుల్లో తాను పార్టీలో కొనసాగానని, కానీ నీలో మార్పు మాత్రం రాలేదని జగన్‌కు రాసిన లేఖలో మైసూరా పేర్కొన్నారు.

జగన్ తీరును మైసూరా తన రాజీనామా లేఖలో తప్పుబట్టారు. అదే సమయంలో వైసిపిలో ఉంటూ రాయలసీమ ప్రాంతానికి న్యాయం చేయలేకపోతున్నానని అభిప్రాయపడ్డారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వస్తుందని, మంచి ప్రాధాన్యం ఇస్తామని జగన్ మధ్యవర్తుల ద్వారా హామీ ఇచ్చారన్నారు. రాజ్యసభకు పంపి, కేంద్రమంత్రి పదవి కూడా ఇప్పించే దిశగా చర్యలు చేపడతామని కూడా జగన్ వారి ద్వారా చెప్పించారన్నారు. అయితే ఆ తర్వాత తనకు పార్టీలో అసలు విలువే ఇవ్వలేదని, సీనియర్లకు విలువ ఇచ్చే అలవాటే జగన్‌లో లేదని మైసూరా అన్నారు. పార్టీలో తాను చేరిన వైనాన్ని మైసూరా తన రాజీనామా లేఖలోనూ జగన్‌కు వివరించడం గమనార్హం. కాగా, మైసూరా రెడ్డి 2012లో టిడిపిని వీడి, వైసిపిలో చేరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: