డోనాల్డ్ ట్రంప్ ఊపుమీదున్నారు. అమెరికా ప్రైమరీ ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి జోరుకు బ్రేక్ లేకుండాపోతోంది. అయిదు ఈశాన్యా రాష్ర్టాల్లో జరిగిన ట్రంప్ జయకేతనం ఎగురవేశారు. కనక్టికట్, డెలావేర్, మేరీల్యాండ్, పెన్సిల్వేనియా, రోడ్ ఐలాండ్ రాష్ర్టాల్లో డోనాల్డ్ ట్రంప్ విక్టరీ కొట్టారు. దాంతో అతను అధ్యక్ష అభ్యర్థిత్వానికి మరింత చేరువయ్యారు. జూలైలో జరగనున్న పార్టీ జాతీయ సమావేశానికి ముందే ట్రంప్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే అవకాశాలున్నాయి. . ఈ ఎన్నికలతో దాదాపు 950 మంది డెలిగేట్లను గెల్చుకున్న ట్రంప్.. రిపబ్లికన్ పార్టీ నామినేషన్ సాధించడానికి కావల్సిన మేజిక్ నంబర్ 1,237కు చేరువవుతున్నారు.

 

డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ కూడా దూకుడు ప్రదర్శిస్తున్నారు. మంగళవారం జరిగిన ఎన్నికల్లో ఆమె నాలుగు రాష్ర్టాల్లో విజయం సాధించారు. మరో చోట బెర్నీ శాండర్స్ గెలుపొందారు. రోడ్ ఐల్యాండ్ రాష్ట్రంలో అతను విక్టరీ సాధించారు. నాలుగు రాష్ర్టాల్లో గెలుపొందిన తర్వాత హిల్లరీ క్లింటన్ ఫిలడెల్ఫియా కన్వెన్షన్ సెంటర్‌లో మాట్లాడారు. అమెరికా పౌరుల జీవితాలను మరింత చైతన్యవంతంగా తీర్చదిద్దనున్నట్లు ఆమె చెప్పారు. మరోవైపు హిల్లరీ కూడా డెమోక్రాటిక్ నామినేషన్ సాధించే దిశగా 2,141 మంది డెలిగేట్ల మద్దతుతో మేజిక్ నంబర్ 2,383కు చేరువలో ఉన్నారు.


  ఒకవేళ దేశాధ్యక్షుడిగా ఎన్నికైతే తన విధానాలను మార్చుకునే ప్రసక్తే లేదని ట్రంప్ తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు. న్యూయార్క్‌లో ఆయన మాట్లాడుతూ తాను మారడం లేదన్నారు. తాను బెస్ట్ స్కూళ్లో చదువుకున్నానని, తానో స్మార్ట్ వ్యక్తిని అని, దేశం తరపున తాను ఉన్నతంగా నిలుస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. తన వ్యక్తిత్వాన్ని తాను మార్చుకునే ఉద్దేశం లేదన్నారు.

 

  ట్రంప్‌పై ప్రియాంక చోప్రా మండిపాటు

డోనాల్డ్ ట్రంప్‌పై బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా మండిపడ్డారు. అమెరికాలో ముస్లింలు ప్రవేశించకుండా నిషేధం విధించాలని ట్రంప్ పిలుపు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. మంగళవారం రాత్రి న్యూయార్క్‌లో జరిగిన టైమ్ 100 గాలాకు ఇద్దరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రియాంక ఉగ్రవాదంపై మాట్లాడుతూ..ఉగ్రవాదాన్ని నిరోధించే క్రమంలో అమెరికాలో ముస్లింలపై నిషేధం విధించడం అనేది అనాగరిక చర్యగా ఆమె అభిప్రాయ పడ్డారు.


మరింత సమాచారం తెలుసుకోండి: