రెండు మూడు రోజులుగా డిల్లీలో జగన్ హల్ చల్ చేస్తున్నాడు. కేంద్రమంత్రులను కలుస్తున్నాడు. ఏపీలో అవినీతి జరిగిపోతోందని గగ్గోలు పెడుతున్నారు. ఏకంగా ఓ పుస్తకమే ముద్రించి అందరికీ పంచిపెడుతున్నాడు. దీంతో జగన్ కు బాగానే పబ్లిసిటీ కూడా వస్తోంది. అలాగే జాతీయ స్థాయిలో ఏపీలో జరుగుతున్న అవినీతిపై చర్చ జరుగుతోంది. 

ఇది కాస్తా ఇప్పుడు టీడీపీకి కంటగింపుగా మారింది. రాజ్ నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ వంటి కేంద్ర మంత్రులు జగన్ కు అపాయింట్ మెంట్ ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడటాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. మరి జగన్ ఇచ్చిన పుస్తకంలో మేటర్ లో సత్తా ఉందని భయపడుతున్నారో.. లేక నిప్పులేందే పొగరాదని కేంద్ర నేతలు భావిస్తారనుకున్నారో తెలియదు కానీ..జగన్ టూర్ టీడీపీ నాయకులకు ఇబ్బందికరంగా మారింది. 

అందుకే కేంద్రమంత్రులు జగన్ కు అపాయింట్ మెంట్ ఇవ్వడమే సరికాదని టీడీపీ కొత్త రాగం అందుకుంటోంది. జగన్ కు కేంద్ర మంత్రులు అపాయింట్ మెంట్ ఇవ్వకుండా ఉండాల్సిందంటూ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. 13 చార్జ్ షీట్లు ఉన్న ముద్దాయి.. 16 నెలలపాటు జైల్లో ఉండి వచ్చిన జగన్ కు అపాయింట్ మెంట్ ఇవ్వడం ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తోందని యనమల అంటున్నారు. 

జగన్ ఏపీ ప్రతిపక్షనేత.. 67 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకి అధ్యక్షుడు.. అలాంటి వ్యక్తికి అపాయింట్ మెంట్ ఇవ్వవద్దని కోరడం టీడీపీకి సబబేనా అన్న చర్చ జరుగుతోంది. జగన్ పై విచారణ మాత్రమే జరుగుతోందని.. ఆయన దోషిగా నిర్థరణ కాలేదన్న విషయం టీడీపీ కావాలనే విస్మరిస్తోందా.. లేక జగన్ ను డిఫెన్సులో పడేసేందుకు ఈ కొత్త వాదన తెస్తుందా అన్నది ఆలోచించాల్సిన విషయం. 



మరింత సమాచారం తెలుసుకోండి: