కింగ్‌ఫిషర్ హౌజ్‌ను విక్రయించడంలో విఫలమైన బ్యాంకులు తాజాగా సంస్థకు చెందిన లోగోతోపాటు ైఫ్లె విత్ గుడ్ టైమ్స్ ట్రేడ్‌మార్క్‌ను ఈనెల 30న వేలం వేసేందుకు సిద్ధమవుతున్నాయి. వీటి రిజర్వ్ ధరను రూ.366 కోట్లుగా నిర్ణయించారు.బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలు ఎగొట్టి, విదేశాలకు వెళ్లిపోయిన ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు బిగుసుకున్న ఉచ్చు మరింత బలపడేలా కనిపిస్తోంది. లండన్‌లో ఉంటున్న విజయ్ మాల్యాను తమకు అప్పగించాలని బ్రిటన్‌ ప్రభుత్వానికి కేంద్రం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు విదేశాంగ శాఖ... బ్రిటన్ హై కమిషనర్‌కు లేఖ రాసింది.

 

బ్రిటన్ ప్రభుత్వం మాల్యాను బహిష్కరించే వరకు పట్టువిడవకుండా ప్రయత్నాస్తామన్నారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ నుంచి రుణ బకాయిలు రాబట్టేందుకు బ్యాంకుల కన్సార్టియ చర్యలను ముమ్మరం చేసిన నేపథ్యంలో మాల్యా గుట్టుచప్పుడు కాకుండా గతనెల 2న దేశం వీడారు. ప్రస్తుతం ఆయన లండన్‌కు గంటప్రయాణ దూరంలో ఉన్న గ్రామంలోని తన నివాసంలో ఉన్నట్లు సమాచారం. 17 బ్యాంకుల కన్సార్టియానికి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రూ.9,400 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. 

ఐడీబీఐ బ్యాంక్ నుంచి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ తీసుకున్న రూ.900 కోట్ల రుణానికి సంబంధించి మనీలాండరింగ్ ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తున్నది. ఐడీబీఐ నుంచి తీసుకున్న రుణంలో రూ.430 కోట్లను మనీలాండరింగ్ ద్వారా విదేశాల్లో ఆస్తుల కొనుగోలుకు వాడుకున్నారని మాల్యాపై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు విచారణకు సంబంధించి ముంబైలోని ఏజెన్సీ కార్యాలయంలో ప్రత్యక్షంగా హాజరుకావాలంటూ మార్చి 10 నుంచి ఈనెల 2 మధ్య మాల్యాకు ఈడీ మూడుసార్లు సమన్లు జారీ చేసింది. మూడుసార్లూ గడువు తేదీనాడు ఏజెన్సీ ముందు హాజరయ్యేందుకు నిరాకరించిన మాల్యా.. మే వరకు గడువు కావాలని కోరారు. దాంతో ఈడీ ఆయనపై చర్యలకు దిగింది. దర్యాప్తు ఏజెన్సీ అభ్యర్థన మేరకు ప్రత్యేక పీఎంఎల్‌ఏ(మనీలాండరింగ్ నిరోధక చట్టం) కోర్టు మాల్యాపై నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది. అలాగే ఈడీ విజ్ఞప్తి మేరకు విదేశాంగ శాఖ ఆయన పాస్‌పోర్టును రద్దు చేసింది. 


మాల్యా భారత్ కు తిరిగిరాకపోవడం, ఆయనపై దాఖలయిన పిటిషన్లు, కేసులపై విచారణ నిమిత్తం స్వదేశానికి తిరిగి రావాలన్న ఆదేశాలను పాటించకపోవడంపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇటీవలే ఆగ్రహం వ్యక్తం చేసింది. పైగా తనని అరెస్టు చేస్తారనే భయంతోనే భారత్ కు రావడం లేదంటూ మాల్యా దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయస్థానం మంగళవారం కొట్టివేసింది. విదేశాల్లో ఉన్న ఆస్తుల వివరాలను ఇచ్చిన గడువులోగా వెల్లడించాలని జస్టిస్ కురియన్ జోసెఫ్, ఆర్ఎఫ్ నారీమన్ లతోకూడిన బెంచ్ ఈ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు బ్యాంకులకు రూ.9,400 కోట్ల రుణాల ఎగవేతను క్షుణ్ణంగా పరిశీలించిన 10మంది సభ్యుల కమిటీ ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దుచేయడానికి అంగీకరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: