అమరరాజా బ్యాటరీస్ ఎండీ, గుంటూరు లోక్ సభ సభ్యుడు గల్లా జయదేవ్ వరుసగా ప్రమాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇటీవలే తన సొంత నియోజకవర్గంలో ఓ బ్రిడ్జిని ప్రారంభించేందుకు వెళ్లిన సందర్భంగా ఆయన కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో గల్లా జయదేవ్ కు ఎలాంటి గాయాలు కాలేదు. కానీ నేటి ఉదయం కృష్ణా జిల్లాలోని గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి గుంటూరు వెళుతున్న సందర్భంగా జరిగిన ప్రమాదంలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. గుంటూరులో కొద్దిసేపటి క్రితం ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఐటీసీ నిర్మించనున్న స్టార్ హోటల్ కు భూమి పూజ చేశారు.

 

 స్థానిక ఎంపీ హోదాలో ఈ కార్యక్రమానికి గల్లా జయదేవ్ హాజరుకావాల్సి ఉంది. విమానంలో గన్నవరం చేరుకున్న జయదేవ్... అక్కడి నుంచి రోడ్డు మార్గం మీదుగా గుంటూరు బయలుదేరారు. ఈ క్రమంలో రోడ్డుపై కనిపించిన ఓ కుక్కను తప్పించే క్రమంలో గల్లా కారు అదుపు తప్పింది. రోడ్డు పక్కగా ఉన్న మట్టి గుట్టను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గల్లాకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో ఎంపీని హుటాహుటిన విజయవాడకు తరలించి అనుచరులు ఆయనకు ప్రథమ చికిత్స చేయించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 

మరోవైపు గుంటూరులో ఐటీసీ నిర్మిస్తున్న పైవ్ స్టార్ హోటల్ శంకుస్థాపన కార్యక్రామానికి ఏపీ సభాపతి కోడెల శివప్రసాదరావు, మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిశోర్‌బాబు, ఐటీసీ ఛైర్మన్‌ వైసీ దేవేశ్వర్‌, ఎంపీ గల్లా జయదేవ్‌, ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి తదితరులు హాజరయ్యారు. ఇదిలా ఉంటే గుంటూరు పట్టణంలో ఏర్పాటవుతున్న తొలి ఐదు నక్షత్రాల హోటల్‌ ఇదే కావడం విశేషం. 1.44 ఎకరాల విస్తీర్ణంలో 12 అంతస్థులు, 150 గదులతో మూడేళ్లలో హోటల్‌ నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. హోటల్ నిర్మాణం పూర్తైన తర్వాత ఐటీసీ హెడ్ ఆఫీస్‌తో పాటు సిబ్బంది మొత్తం గుంటూరుకు తరలించనున్నట్లు ఐటీసీ ప్రతినిధులు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: