ఐఎస్ ఉగ్రవాదుల కష్టాలు అంతా ఇంతా కాదు. ప్రపంచం మొత్తం వారిపై పటిష్ఠ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయడంతోవారికి ఆర్ధిక కష్టాలు మొదలయ్యాయి. రోజువారి ఖర్చులకు కూడా ఎల్లని పరిస్థితి వారిది. అందుకే వారు ఈ కష్టాల నుండి బయటపడడానికి సరికొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఆదాయం సమకూర్చుకునేందుకు అన్ని మార్గాల్లో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే వారు చేపల వ్యాపారం కూడా మొదలు పెట్టారు. మిలియన్ల డాలర్ల డబ్బును చేపల వ్యాపారం ద్వారా ఆర్జిస్తున్నారు.

 

ఇరాక్‌లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు చమురు కేంద్రాలపై చాలా డబ్బు సంపాదించేవారు. ఇటీవల అమెరికా ఆధ్వర్యంలోని సైన్యం చమురు కేంద్రాలపై వైమానిక దాడులు చేసింది. చాలాచోట్ల చమురు కేంద్రాలను ఉగ్రవాదుల ఆధీనం నుంచి స్వాధీనం చేసుకుంది. దీంతో వారు డబ్బు సంపాదించడానికి వేరే మార్గాలు చూసుకుంటున్నారు. చేపలు అమ్మడంతో పాటు కార్ల డీలర్‌షిప్‌లు, ఫ్యాక్టరీల ద్వారా డబ్బు సంపాదిస్తున్నట్లు ఇరాక్ అధికారులు తెలిపారు. ఉగ్రవాదుల ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లోని వందలాది సరస్సులు, చేపల చెరువుల్లోని చేపలు అమ్మి మిలియన్ల డాలర్లు సంపాదిస్తున్నారు.

 

చేపలు పెంచే వారి వద్ద నుంచి చెరువులు లాక్కుంటున్నారు. కొందరు యజమానులు చెరువులను వదిలేసి పారిపోయారు. తమను చంపేస్తారేమోనన్న భయంతో మరికొందరు ఉగ్రవాదులకు సహకరిస్తున్నారు. 2007 నుంచే ఉగ్రవాదులకు చేపల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం అందుతోంది. దీంతో పాటు ఉగ్రవాదులు కార్ల డీలర్‌షిప్ తీసుకుంటున్నారు. వారి ఆధీనంలో ఉన్న మౌసుల్ తదితర నగరాల్లో ప్రభుత్వ ఫ్యాక్టరీలను కూడా నడిపించి డబ్బు సంపాదిస్తున్నారని ఇరాక్ అధికారులు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: