తమిళనాట జయలలిత తిరుగులేని శక్తిగా కనిపిస్తున్నారు. తమిళ  ఎన్నికల, రాజకీయ చరిత్రను తిరగరాస్తూ రెండోసారి వరుసగా అధికారం చేపట్టడం ఖాయమని అనేక సర్వేలు చెబుతున్నాయి. జయలలిత కూడా ఆరోగ్యపరంగా, వయసు పరంగా నీరసంగా కనిపిస్తున్నా.. రాజకీయ ఎత్తుగడల్లో మాత్రం దూకుడుగానే పావులు కదుపుతున్నారు. 

అలాంటి జయలలితను ఓ తెలుగు వ్యక్తి ఢీ కొంటున్నాడు. అమ్మతో సమరానికి సై అంటున్నాడు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పోటీ చేస్తోన్న ఆర్కే నగర్ నియోజక వర్గంలో జయకు పోటీగా ఓ తెలుగు వ్య్తక్తి బరిలో దిగాడు. ఏ పార్టీ నుంచి అనుకుంటున్నారా.. ఆయనకు పార్టీలతో సంబంధమే లేదు. ఆయనే తెలుగు యువశక్తి నేత కేతిరెడ్డి  జగదీశ్వర్ రెడ్డి.

జయ పోటీచేస్తున్న ఆర్కేనగర్ లో ఆయన కూడా నామినేషన్ వేశారు. విచిత్రమేమిటంటే.. కొన్నేళ్ల క్రితం వరకూ ఈ రెడ్డిగారు  జయలలిత వీరాభిమాని. ఇప్పుడు మాత్రం ఆమె పేరు చెబితేనే అంతెత్తున లేస్తున్నాడు. ఎక్కడ తేడా వచ్చింది అనుకుంటున్నారా.. జయ కంటే తెలుగును ఎక్కువ అభిమానించే కేతిరెడ్డి.. అమ్మ తెలుగు భాషకు ఏమీ చేయకపోడవడాన్ని నిరసిస్తున్నారు. ఆర్కేనగర్లో దాదాపు 30 శాతం వరకూ తెలుగు ఓటర్లున్నారు. 

కొత్తగా తెలుగు భాషకు అమ్మ ఏమీ చేయకపోగా.. గతంలో ఉన్న కొన్ని సౌకర్యాలు కూడా తొలగించడాన్ని కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఆమె పోటీ చేస్తోన్న నియోజక వర్గంలో తాను కూడా పోటీకి దిగుతున్నారు. గత 20 రోజులుగా ప్రచారం చేస్తున్నప్పటికీ ఎక్కడా తెలుగు వారి సమస్యల గురించి ఎటువంటి వాగ్దానం చేయడం లేదని కేతిరెడ్డి అంటున్నారు. పోటీ అయితే చేశారు కానీ జయను ఓడించేంత సీను ఉందా..!?



మరింత సమాచారం తెలుసుకోండి: