ఆదర్శ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణం కేసులో బాంబే హైకోర్టు శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. ముంబైలోని 31 అంతస్తుల ఈ భవనాన్ని కూల్చివేయాలని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖను ఆదేశించింది. తమ ఆదేశాలపై సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకునేందుకు మహారాష్ట్ర ప్రభుత్వానికి 12 వారాల గడువు ఇచ్చింది. ఈ కుంభకోణంతో సంబంధమున్న నాయకులు, మంత్రులు, అధికారులపై దర్యాప్తు చేపట్టాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని బాంబే హైకోర్టు ఆదేశించింది.  బాంబే హైకోర్టు తీర్పుపై కామెంట్ చేసేందుకు మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ నిరాకరించారు.

 

వాస్తవానికి నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఈ భవనాన్ని మూడు నెలల్లో కూల్చి వేయాల్సిందిగా గత 2011 జనవరి 1వ తేదీన పర్యావరణ శాఖ ఆదేశించినప్పటికీ.. భవనాన్ని కూల్చివేయలేదు. ఈ నేపథ్యంలో కోర్టులో దాఖలైన పిటీషన్‌ను విచారించిన కోర్టు.. భవనాన్ని కూల్చివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేస్తూనే.. ఈ అంశంపై మొద‌ట్లోనే స్పందించ‌కుండా నిర్ల‌క్ష్యం వ‌హించిన సంబంధిత అధికారుల‌పై విచార‌ణ ప్రారంభించాల‌ని రక్షణ శాఖను కోరింది. 

 

కార్గిల్‌ యుద్ధంలో పాల్గొన్న అమరవీరుల కుటుంబాలు, ఇతర సైనికుల కోసం ఆద‌ర్శ్ సొసైటీ పేరుతో మొద‌ట ఆరు అంత‌స్తులు నిర్మించాల‌ని భావించి నిర్మాణాన్ని తలపెట్టారు. అయితే అనంత‌రం ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ 31 అంతస్తుల భవన సముదాయం నిర్మాణాన్ని చేప‌ట్టింది. ఈ భ‌వ‌నాన్ని కార్గిల్ యుద్ధంలో అసువులు బాసిన మృతుల కుటుంబాల కోసం నిర్మించగా, రాజకీయ పలుకుబడి కలిగిన నేతలు తమ కుటుంబ సభ్యులకు ఫ్లాట్లను కేటాయించుకున్నారు. ఈ స్కామ్ గత 2010లో వెలుగు చూసింది. ఇందులో నాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ పాత్ర కూడా ఉన్నట్టు ఆరోపణలు రావడంతో ఆయన తన పదవిని కోల్పోయారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: