దేశవ్యాప్తంగా వైద్య, విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే 'జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష' (నీట్‌) నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం యూటర్న్‌ తీసుకున్నది. మెడికల్‌, డెంటల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు పలు రాష్ట్రాల్లో ఈ యేడాది ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించడం చాలా కష్టమని సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం అగమేఘాల మీద ఒక పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను జస్టిస్‌ అనిల్‌ ఆర్‌ దవేతో కూడిన ధర్మాసనం విచారించింది. 2016-17 సంవత్సరానికి అన్ని రాష్ట్రాల్లో ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహించాలని సర్వోన్నత న్యాయస్థానం 28వ తేదీన వెలువరించిన తీర్పును సవరించాలని కేంద్రం తరఫున హాజరైన అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహత్గీ ధర్మాసనాన్ని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ, తమిళనాడు,ఆంధ్రప్రదేశ్‌ తదితర రాష్ట్రాలు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నాయని, ఈ సమయంలో షెడ్యూల్‌లో, పరీక్ష నిర్వహణలో అకస్మాత్తు మార్పులు సంభవిస్తే లక్షలాది మంది విద్యార్థులు అయోమయానికి, ఒత్తిడికి గురవుతారని వివరించారు.

 

అయితే ఇదే వాదనను గత కొన్ని రోజులుగా రాష్ట్రాలు, మెడికల్‌ కళాశాలలు సర్వోన్నత న్యాయస్థానం ముందు వినిపించగా ధర్మాసనం తోసిపుచ్చిన విషయం తెలిసిందే. భవిష్యత్తు తరాల వైద్యులపై ఆందోళనగా ఉన్నట్టు పేర్కొన్న ముకుల్‌ రోహత్గీ, సుప్రీం వెలువరించిన తీర్పు సవరణకు సంబంధించి పలు సూచనలు, సలహాలు చేశారు. 2016 మే 1వ తేదీన నిర్వహించే నీట్‌ పరీక్షను రద్దు చేసి, ఆయా రాష్ట్రాలు ప్రవేశ పరీక్షను నిర్వహించుకునే వెసులుబాటు కల్పించాలని కోరారు. జులై 24వ తేదీ పరీక్షను ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ భాషల్లో నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని విన్నవించారు. 

 

తీర్పును సమీక్షించలేం : ధర్మాసనం
నీట్‌ నిర్వహణపై ప్రత్యేక ధర్మాసనం వెలువరించిన తీర్పును సమీక్షించలేమని జస్టిస్‌ అనిల్‌ ఆర్‌ దవే నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ అంశం ప్రత్యేక ధర్మాసనం పరిధిలోనిదని పేర్కొన్నది. ప్రత్యేక ధర్మాసనం నేడు (శుక్రవారం) విచారణ చేయడం లేదు కాబట్టి ఈ అంశంలో కలుగజేసుకోలేమని, అయితే పరీక్షలు మాత్రం యథాతథంగా నిర్వహించుకోవచ్చని తెలిపింది.
తెలంగాణ, ఏపీతో పాటు అన్ని రాష్ట్రాలకు నీట్‌ వర్తింపజేయనున్నట్టు కేంద్ర వైద్యశాఖ మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. ప్రవేశపరీక్షను నిర్వహించే విషయంలో జమ్మూకాశ్మీర్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు మినహాయింపు ఇవ్వడంలేదని వెల్లడించారు. ఈ మేరకు లోక్‌సభ ప్రశ్నోత్తరాల్లో శుక్రవారం టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌కుమార్‌ అడిగిన ప్రశ్నకు జేపీ నడ్డా తన సమాధానంలో ఈ వివరాలు వెల్లడించారు. నీట్‌ నిర్వహణపై సంకల్ప్‌ చారిటబుల్‌ ట్రస్టు దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు.. ఈ పరీక్షను దేశవ్యాప్తంగా నిర్వహించేందుకు అనుమతించిందని చెప్పారు. 

 

ఒత్తిడిలో విద్యార్థి లోకం : లోక్‌సభలో ఎంపీలు
దేశవ్యాప్తంగా నీట్‌ పరీక్షను నిర్వహించాలని సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు వల్ల విద్యార్థిలోకం తీవ్ర ఒత్తిడిలో ఉందని పలువురు ఎంపీలు లోక్‌సభలో ఆందోళన వ్యక్తం చేశారు. జీరో అవర్‌లో ఈ అంశంపై బీజేపీ, శివసేన ఎంపీలు జగదాంబికా పాల్‌, అరవింద్‌ సావంత్‌ తదితరులు మాట్లాడారు. సుప్రీం తీర్పుపై మానవవనరుల అభివృద్ధి శాఖ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని కోరారు. ఈ పరీక్షను 2018 నుంచి అమలు చేసేలా కేంద్రం సుప్రీంలో పిటిషన్‌ వేయాలని కోరారు. ప్రస్తుతం విద్యార్థులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని, వారికి సాంత్వన చేకూర్చాలని కోరారు. మే 1న నిర్వహించే పరీక్ష వల్ల 80 శాతం విద్యార్థులు నష్టపోతారని తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: