తెలంగాణలో ఇప్పుడు సర్కారుకు ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలకు యుద్ధం నడుస్తోంది. ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలను ప్రక్షాళన చేయాలని కేసీఆర్ పట్టుదలగా ఉన్నారు. ఏమాత్రం సౌకర్యాలు, అర్హతలు లేకపోయనా ఈ కాలేజీలు పుట్టగొడుగుల్లా వచ్చాయని వాటిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరవాతనే నడవనీయాలని గట్టి పట్టుదలతో ఉన్నారు.

ఈ విషయంలో తనీఖీల కోసం ఆయన విజిలెన్స్, పోలీస్ శాఖలను కూడా ఉపయోగిస్తున్నారు. దీనిపై ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు మండిపడుతున్నాయి. తమ కాలేజీలను పోలీసులతో తనిఖీలు చేయించడానికి అంగీకరించబోమని పంతానికి పోతున్నాయి. అవసరమైతే.. వచ్చే విద్యాసంవత్సరాన్ని ఎడ్యుకేషన్ హాలిడే గా కూడా  ప్రకటిస్తామని హెచ్చరిస్తున్నాయి. 

ఇప్పటికే ఈ వివాదంతో తెలంగాణలో ఎంసెట్, టెట్  పరీక్షలు  వాయిదా పడింది. కేసీఆర్ సర్కారు తమను కావాలని వేధిస్తోందన్నది ప్రైవేటు కళాశాల యాజమన్యాల వాదన. తెలంగాణ ఉద్యమంలో తాము కేసీఆర్ ను వెన్నంటి అండగా ఉంటే.. ఇప్పుడు తనిఖీల పేరుతో తమను వేధిస్తారా అని సంఘం ప్రతినిధులు మండిపడుతున్నారు. 

ముఖ్యమంత్రి మనుమడు, మంత్రుల పిల్లలు, ఐఏఎస్ ల పిల్లలు అంతా చదువుతున్నది ప్రైవేటు సంస్తలలో కాదా అని వారు కళాశాల యాజమాన్యాల సంఘం ప్రతినిధులు ప్రశ్నించారు. ముందు ప్రభుత్వ కాలేజీలలో వసతులు తనిఖీ చేసుకుని...  ఆ తర్వాత తమ జోలికిరావాలని సవాల్ చేస్తున్నారు. ఈ వివాదం కాస్త ముదిరి విద్యార్థుల భవిష్యత్తుపై పెను ప్రభావం చూపే ప్రమాదం కనిపిస్తోంది. ఇరువర్గాలు పట్టువిడుపులకు పోకపోతే విద్యార్థలు విద్యాసంవత్సరం ఇబ్బందుల్లో పడటం ఖాయం. 



మరింత సమాచారం తెలుసుకోండి: