పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన నలుగురు కళంకిత ఎమ్మెల్యేలు పోటీ చేస్తున్న నియోజకవర్గాలతో పాటు 53 నియోజకవర్గాల్లో నేడు పోలింగ్‌ జరగనుంది. దక్షిణ కోల్‌కతా, హుగ్లీ, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లోని 1.2 కోట్ల మంది ఓటర్లు 349 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ధారించనున్నారు. ఐదో విడత పోలింగ్‌ బరిలో నారదా స్టింగ్‌ ఆపరేషన్‌లో ప్రమేయమున్న పట్టణాభివృద్ధి మంత్రి ఫిర్హాద్‌ హకీం (కోల్‌కతా పోర్ట్‌), కోల్‌కతా మేయర్‌ సోవన్‌ ఛటర్జీ (బెహలా ఈస్ట్‌), ఇక్బాల్‌ అహ్మద్‌ (ఖనకుల్‌), సుబ్రతా ముఖర్జీ (బాలీగంజ్‌) ఉన్నారు. ఇక ఇతర మంత్రులు సుబ్రతా ముఖర్జీ, పార్థ ఛటర్జీ, అరూప్‌ బిశ్వాస్‌, మనీష్‌ గుప్తా, జావేద్‌ అహ్మద్‌ ఖాన్‌, ప్రముఖ గాయని ఇంద్రాణి సేన్‌, ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు నబీ ఐదోవిడత పోరులో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక పోలింగ్‌ నేపథ్యంలో 53 నియోజకవర్గాల్లో ఎన్నికల కమిషన్‌ నిషేధిత ఉత్తర్వులను (144 సెక్షన్‌) జారీ చేసింది. పోలింగ్‌ జరిగే ప్రాంతాల్లో కేంద్ర బలగాల సంఖ్యను రెట్టింపు చేసింది.

 

అందరి దృష్టి భవానీపూర్‌పైనే 
దక్షిణ కోల్‌కతాలోని భవానీపూర్‌లో దిగ్గజాల పోటీ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. తృణమూల్‌ తరపున ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బరిలో నిలిచిన భవానీపూర్‌లో కాంగ్రెస్‌ నుంచి మాజీ కేంద్ర మంత్రి దీపా దాస్‌మున్షీ పోటీలో ఉన్నారు. ఇక నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ మునిమేనల్లుడు చంద్ర కుమార్‌ బోస్‌ను బీజేపీ రంగంలోకి దించింది. సీనియర్‌ కాంగ్రెస్‌ నేత ప్రియరంజన్‌ దాస్‌ మున్షీ భార్య కాంగ్రెస్‌ అభ్యర్థి దీపా దాస్‌మున్షీ తన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు అవినీతి, అరాచక పాలనకు వ్యతిరేకంగా ఓటు వేస్తారని అన్నారు. బెంగాల్‌లో అవినీతితో విసుగెత్తిన ప్రజలు లౌకిక ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని కోరుకుంటున్న ప్రజలు భవానీపూర్‌తోనే దీనికి శ్రీకారం చుడతారని చెప్పారు.

 

ఇక భవానీపూర్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ ఇక్కడ గట్టిపోటీ ఇచ్చేందుకు ప్రముఖులతో ప్రచారం చేపట్టింది. అమిత్‌ షా ర్యాలీలతో పాటు నటులు రూపా గంగూలీ, లాకెట్‌ ఛటర్జీలు రెండు బహిరంగ సభల్లో పాల్గొని మమతా ఓటమికి పిలుపు ఇచ్చారు. అయితే నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేపట్టిన సీఎం మమతా నియోజకవర్గ అభివృద్ధి కోసం తనకే పట్టం కట్టాలని అభ్యర్థించారు. బీజేపీ నేతల మాటలు విశ్వసించవద్దని కోరారు. మమతా బెనర్జీ నివాస ప్రాంతం కాళీఘాట్‌ పరిథిలోని భవానీపూర్‌ నియోజకవర్గంలో 2,02,655 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ బెంగాలీలతో పాటు గుజరాతీలు, సిక్కులు, బీహారీలు, మార్వాడీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: