ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. బయటికి వెళ్ళాలంటేనే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. తీవ్ర వాడగాలులతో, ఉక్కబోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. దాదాపు అన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలను దాటాయి. ఏప్రిల్ మాసం మే మాసాన్ని తలపిస్తోంది. కాకపోతే ఇక్కడ కాస్త ఉపశమనం కలిగించే విషయం ఏంటంటే, ఇసారి వర్షాకాలం కాస్త ముందుగానే రానుందట.

 

ద్రోణి ప్రభావంతో ఆకాశంలో క్యుములోనింబస్‌ మేఘాలు ఏర్పడే అవకాశం ఉన్నందున తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. విదర్భ నుంచి మహారాష్ట్ర మీదుగా ఉత్తర కర్ణాటక వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో శుక్రవారం కోస్తాంధ్ర, తెలంగాణలో ఒకటి, రెండుచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు పేర్కొంది.

 

అలాగే, రాయలసీమలో శుక్రవారం కూడా పొడి వాతావరణమే కొనసాగే అవకాశాలున్నాయి. ఇక్కడ సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీల అదనపు పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు తెలిపింది. 

 

కాగా, గురువారం అనంతపురంలో అత్యధికంగా 44, కర్నూలులో 43, తిరుపతిలో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నెల్లూరులో 42, గన్నవరంలో 41, విజయవాడ, తునిలలో 40, మచిలీపట్నం, కాకినాడలో 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాయలసీమ, కోస్తాంధ్రలోని అత్యధిక ప్రాంతాల్లో శుక్రవారం వేడిగాలులు వీచే అవకాశాలున్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: