ప్రస్తుతం తెలంగాణలో ప్రైవేటు విద్యాసంస్థల యజమానులకు, సీఎం కేసీఆర్ కు మధ్య ప్రచ్చన్న యుద్ధం సాగుతోంది. ప్రైవేటు కళాశాల్లో సౌకర్యాలపై తనిఖీలు చేయించాలన్న కేసీఆర్ నిర్ణయంపై కళాశాల యజమానులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్పులు అందుకుంటున్న కాలేజీల్లో నిబంధనల అమలు, ప్రమాణాల పరిశీలన కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే తనిఖీలకు హైకోర్టు ఆమోదం తెలిపడం ఆసక్తి రేపుతోంది. 

విద్యాశాఖ అధికారులకు సహాయంగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు కూడా తనిఖీలకు వెళ్లేందుకు హైకోర్టు అనుమతించింది. విజిలెన్స్ శాఖకు చెందిన సబ్ ఇన్‌స్పెక్టర్‌తోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లు తనిఖీల బృందంలో ఉండేందుకు అంగీకరించింది. ఈ తీర్పుతో కేసీఆర్ చాలా సంతోషంగా ఉన్నారు. తన సర్కారు చర్యలను హైకోర్టు సమర్థించడంతో ఇక ఆయన వెనక్కు తగ్గకపోవచ్చు. 

ఐతే.. ప్రైవేటు కాలేజీలలో తనిఖీలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రబుత్వానికి, కాలేజీలకు మద్య అంతరం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం హైకోర్టు దీనిపై స్టే ఇచ్చినా... ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసి తన వాదన వినిపించిన తర్వాత కొన్ని షరతులతో తనిఖీలకు హైకోర్టు ఆమోదం తెలిపింది. విజిలెన్స్ సిబ్బంది యూనిఫామ్‌లో కాకుండా సివిల్ డ్రెస్‌లో వెళ్లాలని పేర్కొంది. 

తనిఖీల ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టకుండా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలన్న కాలేజీల అభ్యర్థనను కూడా న్యాయస్థానం తోసిపుచ్చింది. విచారణ సందర్బంగా ప్రభుత్వం తరపున అదనపు ఏజీ జే రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం అందిస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్పుల విషయంలో రాష్ట్రవ్యాప్తంగా పలు కాలేజీల్లో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. గుడ్ గవర్నెన్స్‌లో భాగంగా పారదర్శకత ఉండాలనే భావనతోనే తనిఖీల నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: