'స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని చెబితే.. ప్రయివేటు క్యాబ్స్‌ నడుపుకుంటూ జీవనం సాగించే మేము స్వచ్ఛ ఆటోలను తీసుకోవాలనుకున్నాం. 10శాతం వడ్డీతో డబ్బులు తీసుకొచ్చి బ్యాంకులో సుమారు రూ.లక్ష చెల్లించాం. ఆటోలనూ ఇచ్చారు. కానీ ఇంతవరకు ఇండ్లు కేటాయించకపోవడంతో పనిలేక పస్తులుండాల్సి పరిస్థితి' అంటూ బోరబండకు చెందిన స్వచ్ఛ ఆటో డ్రైవర్‌ శ్రీకాంత్‌ ఆవేదన వ్యక్తం చేశారు.'రోజువారి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాళ్లం. కేసీఆర్‌ చెప్పారు కదా అని స్వచ్ఛ ఆటో కోసం వడ్డీకి డబ్బులు తీసుకొచ్చా. చెత్త సేకరించడానికి ఇంతవరకు ఇండ్లు కేటాయించలేదు.

 

పైగా చెత్త రిక్షాదారులకు, ఆటోడ్రైవర్లకు అధికారులు చిచ్చుపెట్టి మమ్ముల్ని రోడ్డునపడేశారు' అంటూ బోరబండకు చెందిన రవి ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీకాంత్‌, రవి పరిస్థితినే కాదు..జీహెచ్‌ఎంసీ పరిధిలో స్వచ్ఛ ఆటోలు తీసుకున్న డ్రైవర్ల అందరి పరిస్థితి ఇదే. అందుకు స్వచ్ఛ ఆటో డ్రైవర్లకు, చెత్త రిక్షాదారులకు ఇండ్లు కేటాయించకపోవడమే కారణం. ఈ విషయాన్ని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

హైదరాబాద్‌ మహానగరాన్ని క్లీన్‌ అండ్‌ గ్రీన్‌గా చేయాలనే లక్ష్యంతో కోట్ల రూపాయలు వెచ్చించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమం అభాసుపాలవుతుంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల కంటే ముందు స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమం గురించి గొప్పలు చెప్పిన సీఎం కేసీఆర్‌, జీహెచ్‌ఎంసీ అధికారులు పీఠాన్ని దక్కించుకున్న తర్వాత ఆ ప్రస్తావనే మరిచిపోయారు. ఆటో డ్రైవర్లకు ఇండ్లు కేటాయించడం లేదని, ఒకవేళ కేటాయించినా సంబంధిత అధికారులు డబ్బులు వసూలు చేస్తున్నారని ఎల్‌బీనగర్‌కు చెందిన డ్రైవర్లు నేరుగా సీఎం కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. 

 

2000 ఆటోలు
గ్రేటర్‌ హైదరాబాద్‌లో స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను సేకరించేందుకు 2,500స్వచ్ఛ ఆటోలను కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తర్వాత వాటిని 2000కు కుదించారు. ఆటో ధర రూ.4లక్షలకుగాను ఎస్‌సీ, ఎస్‌టీ లబ్దిదారులు రూ.40వేలు, బీసీ, ఇతరులు రూ.80వేలు చెల్లించాలని అధికారులు ప్రకటన విడుదల చేశారు. అయితే, 2000 ఆటోల కోసం 2,472 మంది డబ్బులు చెల్లించారు. 1,750మంది లబ్దిదారులకు ఆటోలను అందజేశారు. మరో 388 మందికి ఇంత వరకు ఆటోలను ఇవ్వలేదు. 


'చెత చిచ్చు
ఆటోల కంటే ముందు ఆయా కాలనీల్లో రిక్షాల ద్వారా చెత్తను సేకరిస్తున్నారు.

 

స్వచ్ఛ ఆటోలు వచ్చాక, ఆటోకు 600-800 ఇండ్లను కేటాయిస్తామని అధికారులు చెబుతున్నారు. గ్రేటర్‌లో ఎక్కడా పూర్తిస్థాయిలో కేటాయించలేదు. కేటాయించిన చోట రిక్షా కార్మికులకు, ఆటో డ్రైవర్లకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఎల్‌బీనగర్‌ సర్కిల్‌లో ఇరువర్గాలు దాడి చేసుకున్నారు. పైగా డబ్బులు ఇచ్చిన వారికే అధికారులు ఇండ్లను కేటాయిస్తున్నారని బోరబండ, ఎల్‌బీనగర్‌ ప్రాంతాల ఆటో డ్రైవర్లు చెబుతున్నారు. బస్తీలకు రూ.5000, మధ్యతరగతి, సంపన్నులు ఉండే ప్రాంతాలు అయితే రూ.20వేల నుంచి 30వేల వరకు డబ్బులు వసూలు చేస్తున్నారని చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: