చంద్రబాబు ఏ మీటింగ్ లో మాట్లాడాల్సి వచ్చినా మొదట చెప్పే మాట ఏంటో తెలుసా.. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారు.. రాజధాని ఎక్కడో చెప్పకుండా వెళ్లగొట్టారు.. 16 వేల కోట్ల లోటుతో రాష్ట్రాన్ని ఇచ్చారు. అంతవరకూ ఓకే.. ఆ తర్వాత చెప్పే మాటలు.. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలు తెచ్చాం.. 24 గంటలపాటు కరెంటు ఇచ్చే రాష్ట్ర్రంగా మార్చాం.. 

విద్యుత్ సంస్కరణల విషయం ఎలా ఉన్నా.. చంద్రబాబు అధికారంలోకి రాగానే  24 గంటల పాటు కరెంటు ఇచ్చిన మాట వాస్తవం. కేంద్రం వద్ద మిగిలి ఉన్న కరెంటును తన పరపతితో ఏపీకి రప్పించుకుని నిరంతర విద్యుత్ పథకంలో ఏపీకి చోటు కల్పించుకుని ఆ ఫీటు సాధించారు. అంతవరకూ చంద్రబాబు గొప్పతనాన్ని ఒప్పుకుని తీరాల్సిందే. అయితే ఇప్పుడు సీన్ మారింది. 

ప్రస్తుతం ఎండాకాలం కావడం వల్ల సప్లయ్ తగ్గింది. డిమాండ్ విపరీతంగా పెరిగింది. నిన్న మొన్నటి వరకూ ఎలాగో ఏమో గానీ.. ఇప్పుడైతే మళ్లీ కరెంటు కోతలు మొదలయ్యాయి. ప్రత్యేకించి ఉత్తరాంధ్ర కరెంటు కోతలతో అల్లాడిపోతోంది. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కరెంటు కోతలు దారుణంగా ఉన్నాయట. విశాఖలో పవర్ కట్.. ఏ సమయంలో ఉంటుందో చెప్పలేకపోతున్నారట. 

అధికారికంగా గంటసేపు.. అనధికారంగా నాలుగు గంటలు కరెంటు తీస్తున్నారట. దీనికి వేళాపాళా లేదట. అసలే వేసవి ఉక్కపోత.. దీంతో పిల్లలు, వృద్ధులు నరకం చూస్తున్నారట. ఇక పల్లెల సంగతి మరీ దారుణంగా ఉంది.. చివరకు ఇన్వర్టర్లు ఉన్నా అవి కూడా పనిచేయని పరిస్థితి ఉందట. మరి ఇప్పుడు చంద్రబాబు నిరంతర కరెంటు సరఫరా విజయ ప్రసంగాలు ఢిల్లీ వీధుల్లో చేయగలరో లేదో.. 



మరింత సమాచారం తెలుసుకోండి: