భారత ప్రధానిగా నరేంద్రమోడీ అధికార పీఠం ఎక్కి రెండేళ్లు పూర్తవుతోంది. మరి మోడీ ఏలుబడిపై జనం ఎలా ఫీలవుతున్నారు. ఎన్నో ఆశలతో జనం మోడీకి పాలనా పగ్గాలు అందించారు.గతంలో ఎన్నడూలేని విధంగా ఓ పార్టీ మెజారిటీ సీట్లు కట్టబెట్టారు. మరి మోడీ వారి ఆశలకు తగ్గట్టుగా పాలిస్తున్నాడా.. ఏమేరకు మార్కులు కొట్టేశాడు. 

ఈ ప్రశ్నలకు సమాధానంగా సీఎంఎస్ సర్వే ప్రజలను ప్రశ్నించి సమాధానాలు రాబట్టింది. మోడీ ప్రభుత్వం ఏ మేరకు జనాన్ని మెప్పించింది.. ఏఏ అంశాల్లో ఫెయిలైంది. జనం మెచ్చిన పథకాలేంటి వంటి అంశాలపై తాజా సర్వే ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. ప్రజల్లో ఇంకా మోడీ వ్యక్తిగత ప్రతిష్ఠ ఏమాత్రం తగ్గలేదట. 15 రాష్ట్రాల్లో నిర్వహించిన ఈ సర్వేలో ప్రధానిగా మోడీ పనితీరు పట్ల 70 శాతం ప్రజలు హ్యాపీగానే ఉన్నారట. 

అంతేకాదు.. వచ్చే ఐదేళ్ల తర్వాత కూడా మళ్లీ మోడీయే కావాలనుకునేంతగా మోడీ వారిని అట్రాక్ట్ చేస్తున్నారు. ఐతే మోడీ సర్కారుతో తమ జీవితాల్లో పెద్ద మార్పేమీ రాలేదని దాదాపు 50 శాతం మంది అభిప్రాయపడ్డారట. తమ పరిస్థితి ఇంకా దిగజారిందని మరో 15 శాతం మంది చెప్పారట. మోడీ ప్రభుత్వం చేపట్టిన పథకాలతో పెద్దగా ఒరిగిందేమీ లేదని 43శాతం జనం ఫీలవుతున్నారు. 

ప్రధానమంత్రి తన హామీలు నెరవేర్చారని మూడింట ఒకటో వంతు కన్నా తక్కువ మందే భావిస్తున్నారు. ఆ హమీలు పాక్షికంగానే నెరవేరాయని సుమారు 48శాతం మంది అభిప్రాయపడ్డారు. కాకపోతే ప్రపంచస్థాయిలో భారత్‌ స్థానాన్ని మోడీ నిలబెట్టాడని అత్యధికులు ఫీలవుతున్నారు. అలాగే దేశీయంగానూ పాలన మెరుగుపరిచే విషయాల్లో మోడీ గొప్ప కృషి చేస్తున్నాడని ఫీలయ్యారు. సో.. జనానికి ఇంకా మోడీ ఆకర్షణ తగ్గలేదన్నమాట. 



మరింత సమాచారం తెలుసుకోండి: