తమిళనాట ఎన్నికల పోరు జోరుగా సాగుతోంది. మాటల యుద్ధం మహా రంజుగా సాగుతోంది. ఐతే.. అన్నాడీఎంకే భారమంతా పార్టీ చీఫ్ జయలలితపైనే ఉంటే.. డీఎంకేకు మాత్రం కరుణానిధి స్టాలిన్ ప్లస్ పాయింట్ గా మారాడు. జయలలిత, కరుణానిధి వయస్సురీత్యా, ఎండల రీత్యా పరిమితంగా తిరుగుతున్నారు. 

కానీ స్టాలిన్ మాత్రం రాష్ట్రమంతటా తిరుగుతూ డీఎంకే తరపు జోరుగా ప్రచారం చేస్తున్నాడు. అంతే కాదు స్టాలిన్ తన ప్రచారంలో జయలలిత పాలనను, వ్యవహార  శైలిని ఎద్దేవా చేస్తూ ఓట్లను అభ్యర్ధిస్తున్నారు. ఐదేళ్లలో జయలలిత ఏనాడూ రాజధాని దాటి బయటకు  కాలు మోపలేదంటూ ఆమెను ఇమిటేట్ చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. 

జయలలిత మంత్రులను, పార్టీ నేతలను కట్టు  బానిసలకంటే హీనంగా చూస్తారని విమర్శిస్తున్నాడు స్టాలిన్. తన ప్రసంగాలలో గత ఐదేళ్ల అన్నాడీఎంకే పాలనను తూర్పార పట్టడంలో స్టాలిన్ సక్సస్ అవుతున్నారు. ముఖ్యమంత్రిగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజల బాగోగులు ప్రత్యక్షంగా చూడాల్సిన జయలలిత ఏనాడూ రాజధానిని దాటిన పాపాన పోలేదని గుర్తు చేస్తున్నారు. 

ఇక జయలలిత ఎన్నికల ప్రచార సభలను నిర్వహిస్తోన్న తీరు కూడా స్టాలిన్ విమర్శలకు మంచి సరుకుగా మారింది. జయలలిత సభలలో తాను మాత్రం వేదికపై కుర్చీ వేసుకుని కూర్చుంటున్నారు. అభ్యర్ధులను మాత్రం కింద నిలబెట్టి బొమ్మల్లా ఉంచి.. పరిచయం చేస్తున్నారు. అభ్యర్ధులు కూడా తాము రాజకీయ నాయకులమన్న సంగతి మరిచినట్టు బానిసల్లా జయలలితకు వంగి వంగి సలాం కొడుతుంటారు. 

ఈ మొత్తం వ్యవహారాన్ని స్టాలిన్ బ్రహ్మాండంగా ఇమిటేట్ చేస్తున్నాడు. జయలలిత ఎమ్మెల్యేలను కూడా పూచిక పుల్లతో సమానంగా జయలలిత పరిగణిస్తారని స్టాలిన్ మండిపడ్డారు. మరి స్టాలిన్ విమర్శళు తమిళులను ఆకట్టుకుంటాయి. యథాప్రకారం రొటేషన్ పద్దతిలో డీఎంకేకు అధికారం కట్టబెడతాయా.. చూడాలి.. ఏం జరుగుతుందో..!?



మరింత సమాచారం తెలుసుకోండి: