వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. తెలుగు రాజకీయాలను విపరీతంగా ప్రభావితం చేసిన అతికొద్దిమంది నాయకుల్లో ఈ వైఎస్ ముందుంటారు. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డిలో రెండు ముఖాలుంటాయని ఆయన రాజకీయ వ్యుహాలను దగ్గరి నుంచి పరిశీలించిన వారు చెబుతుంటారు. తనను నమ్మినవారిని రక్షించుకునేందుకు ఆయన ఎంతో ప్రయారిటీ ఇస్తారు. 

అందుకు రాజకీయంగా ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా సహిస్తారు. అలాగే వైఎస్ ఒక నిర్ణయం తీసుకుంటే దాని కోసం ఎందరినైనా ఎదిరిస్తారు. చివరకు సొంత పార్టీ వారినైనా సరే. అందుకే ఆయన అత్యధిక కాలం కాంగ్రెస్ లో అసమ్మతి నేతగానే గుర్తింపు పొందారు. ఐతే ఆయన సీఎం అయిన తర్వాత రాయలసీమకు నీళ్లిచ్చే ప్రాజెక్టులపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. 

ప్రత్యేకించి పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ నిర్మాణం గురించి ఎంతగానో తపించారు. ఈ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతల నుంచి ఎంతగా వ్యతిరేకత వ్యక్తమైనా లెక్కచేయలేదు.  ఈ గత చరిత్ర గురించి ఇప్పడు కాంగ్రెస్ ఎంపీ వీ హనుమంతరావు కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు విస్తరణను పి.జనార్ధన్ రెడ్డి వ్యతిరేకించారని, అందుకుగాను వైఎస్ మానసికంగా ఆయనను వేధించారని వీహెచ్ గుర్తు చేస్తున్నారు. 

పరోక్షంగా పీజేఆర్ మరణానికి వైఎస్సే కారణమని వీహెచ్ అంటున్నారు. అలాంటి వైఎస్ కుమారుడైన జగన్ ఇప్పుడు నీటి కోసం దీక్ష చేయడం విడ్డూరంగా ఉందని వీహెచ్ మండిపడుతున్నారు. జగన్ ది కన్నీరు కాదని మొసలి కన్నీరు అని విమర్శిస్తున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో దారుణ పరిస్థితులకు దారి తీసిన పార్టీ ఫిరాయింపులకు బీజం వేసింది కూడా వైఎస్ రాజశేఖరరెడ్డే అని విమర్శిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: