వైసీపీ నుంచి టీడీపీకి ఎమ్మెల్యేల వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే 16 మంది ఎమ్మెల్యేలు పసుపు కండువా కప్పుకున్నారు. కనీసం 30 మందిని తమవైపు తిప్పుకోవాలన్నది టీడీపీ వ్యూహంగా తెలుస్తోంది. ఈమేరకు మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రలోభాల పర్వం కొసాగుతోందట. సీఎం చంద్ర‌బాబు ప్రోత్సాహంతో ఆయ‌న త‌న‌యుడు లోకేష్‌, ఎంపీ సీఎం ర‌మేష్ ప్ర‌లోభాల ప‌ర్వాన్ని కొన‌సాగిస్తున్నార‌ని మాడుగుల వైసీపీ ఎమ్మెల్యే బూడి ముత్యాల‌నాయుడు ఆరోపిస్తున్నారు. 

చంద్రబాబు, లోకేశ్ ఇధ్దరూ తనను ప్రలోభపెట్టారని ఆయన వివరిస్తున్నారు. తండ్రీకొడుకులకు తోడు టీడీపీకి చెందిన ఇద్ద‌రు ఎంపీలు ఫిరాయింపుల‌ విషయం బ్రోకర్లుగా మారారని ఆయన అంటున్నారు. టీడీపీలోకి వస్తే రాజ‌ధాని ప్రాంతంలో ఎక‌రా భూమి, రూ. 15 నుంచి రూ. 20 కోట్ల వ‌ర‌కు డ‌బ్బు, పెద్దఎత్తున కాంట్రాక్టులు ఇప్పిస్తామ‌ని ఎర వేశార‌ని ముత్యాలనాయుడు వివ‌రించారు. అంతే కాదు.. ఈ డీల్ నచ్చకపోతే.. ఏం కావాలో బేరం ఆడుకునే స్వేచ్చ కూడా ఉందని ఆ ఎంపీలు తనను నిత్యం సంప్రదిస్తున్నారని ముత్యాలనాయుడు చెబుతున్నారు. 

 కావాలంటే లోకేష్‌తో భేటీ ఏర్పాటు చేస్తామ‌న్నార‌ని వారు చెప్పారని నాయుడు అంటున్నారు. తాను వారిని ఒక్క‌టే అడిగాన‌ని, లోకే్ష్ వాళ్ల నాన్న కూర్చీ నాకు ఇవ్వ‌గ‌ల‌డా...? ఇస్తానంటే అప్పుడు ఆలోచిస్తా అని చెప్ప‌గానే ఫోన్ క‌ట్ చేశార‌ని చెబుతున్నాడు. తాను ఇచ్చిన ఝలక్ తో  ఆ తర్వాత నుంచి మ‌ళ్లీ తనకు ఫోన్లు రాలేద‌ని ముత్యాలనాయుడు చెప్పారు.

ప్ర‌లోభాల‌కు లొంగి టీడీపీలోకి రావ‌ద్ద‌ని ఆ పార్టీకి చెందిన ఒక స‌ర్పంచ్ త‌న‌కు స‌ల‌హా ఇచ్చార‌ని, అంటే చంద్ర‌బాబును ఆ పార్టీ నేత‌లు ఎంత‌లా అస‌హ్యించుకుంటున్నారో దాన్ని బ‌ట్టి అర్థ‌మ‌వుతోంద‌ని ముత్యాలనాయుడు వివరించారు. తిరుగులేని నాయ‌క‌త్వ ప‌టిమ క‌లిగిన వైఎస్ జ‌గ‌న్ నాయ‌క‌త్వంలో ప్ర‌స్తుతం తాను నిజాయితీ క‌లిగిన ఎమ్మెల్యేగా ప్ర‌జ‌ల్లో ఉన్నాన‌ని తెలిపారు. వారి ప్రలోభాల‌కు లొంగి పార్టీ మారితే నీతిమాలిన ఎమ్మెల్యేగా మిగిపోతాన‌ని ఆయ‌న పేర్కొన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: