ఎన్నికల్లో జనాకర్షక పథకాలకు తమిళనాడు పెట్టింది పేరు. ఫ్రీ ఫ్రీ ఫ్రీ.. అనే సంస్కృతి తమిళనాడులోనే ఎక్కువ పాపులర్ అయ్యింది. ఏకంగా టీవీలు ఇస్తాం.. ఫ్రిజ్జులిస్తాం.. అంటూ వరాల మీద వరాలు కురిపించడం అక్కడ వెరీ కామన్. ఐతే.. ఈసారి తమిళనాడులో ఏం హాట్ హాట్ వరాలు కానున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. 

అధికార పార్టీ అయిన అన్నాడీఎంకే ఇంకా తన ఎన్నికల మానిఫెస్టో ప్రకటించలేదు. హామీల వంటకమైన మేనిఫెస్టో సిద్దమైపోయిందని.. దాన్ని ఒకటి రెండు రోజుల్లో విడుదల చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి అమ్మ మనసులో ఏముందో అన్న విషయం ఎవరికీ అంతుబట్టడం లేదు. ఈసారి ఎన్నికల్లో పాత సంప్రదాయ ఫలితాలను తోసి రాజని మళ్లీ అన్నా డీఎంకే గెలుస్తుందని నిన్నమొన్నటివరకూ అమ్మ ధీమాగానే ఉంది.

కానీ ఎన్నికల తేదీ దగ్గరపడే కొద్దీ.. ఆ ధైర్యం అలాగే ఉండటం లేదు. డీఏంకేను తక్కువ అంచనా వేయడం రాజకీయ పొరపాటు అవుతుందని గ్రహించిన జయలలిత మరింత పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అందుకే ఎన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా ఎన్నికల వేళ ఏదో ఒక పెద్ద తాయిలం ప్రకటించాల్సిందే అన్నపట్టుదలతో అమ్మ ఉందట. 

అందుకే అన్నాడీఎంకే ఈసారి ఏకంగా ఇంటింటికి మోటార్ సైకిల్ గానీ ఎయిర్ కండిషనర్ ఇస్తామన్న వాగ్దానాన్ని ప్రకటించవచ్చని పబ్లిక్ లో ప్రచారం జరుగుతోంది. ఇలాంటి గట్టి హామీ ఇస్తే ఇక గెలుపుకు డోకా ఉండదని జయ భావిస్తున్నారట. మరి ఇంతకూ అందరినీ విస్మయపరిచేలా అమ్మ ప్రకటించనున్న ఎన్నికల మేనిఫెస్టో తాయిలాలు ఏంటో.. తెలుసుకోవాలంటే ఒకటి రెండు రోజులు ఆగాల్సిందే. 



మరింత సమాచారం తెలుసుకోండి: